దేశంలో ఎలక్ట్రిక్​ హైవేలు.. రోడ్లపై వెళ్తుండగా వాహనాల చార్జింగ్​: నితిన్​ గడ్కరీ

  • ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో కేంద్ర మంత్రి వెల్లడి
  • ఎలక్ట్రిక్‌ హైవేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వివరణ
  • ఈ హైవేల వెంట సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పుతామన్న కేంద్ర మంత్రి
దేశంలో ఎలక్ట్రిక్ హైవేలను అభివృద్ధి చేసే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రహదారుల వెంట విద్యుత్ చార్జింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి.. వాహనాలు ఎప్పటికప్పుడు చార్జింగ్ చేసుకునేందుకు వీలు కల్పించే ప్రతిపాదన ఉందని ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో వెల్లడించారు. 

ఎలక్ట్రిసిటీతో వాహనాల రవాణా కొనసాగే విధంగా వ్యవస్థలను తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. సౌర విద్యుత్ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

టోల్ ప్లాజాలలో సైతం..
ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధిలో భాగంగా సౌర, పవన విద్యుత్ ఆధారంగా చార్జింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో కూడా సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసి.. వాహనాల చార్జింగ్ కోసం వినియోగించుకునేలా ప్రోత్సహించనున్నామని వివరించారు.

రైళ్లు నడిచేటప్పుడు పైన ఉన్న విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని పరుగులు తీసిన తరహాలోనే.. ఎలక్ట్రిక్ హైవేల పొడవునా ప్రత్యేక విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తారు. ఈ విద్యుత్ లైన్లను సౌర, పవన విద్యుత్ కు అనుసంధానించనున్నారు. ఈ విద్యుత్ లైన్లు, కేంద్రాలను ఉపయోగించుకుని ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఏయే రూట్లలో ఎలక్ట్రిక్ హైవేలను అభివృద్ధి చేయాలన్న దానిపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు.


More Telugu News