భారత్ లో అత్యుత్తమ బిజినెస్ స్కూల్ ఇదే!

  • బెస్ట్ బిజినెస్ స్కూల్స్ జాబితా రూపొందించిన ఫైనాన్షియల్ టైమ్స్
  • ఐఐఎం బెంగళూరుకు అగ్రస్థానం
  • సంస్థ అందించే పీజీ కోర్సుకు విశిష్ట గుర్తింపు
  • అంతర్జాతీయంగానూ ఐఐఎం బెంగళూరుకు మెరుగైన ర్యాంకు
బిజినెస్ కోర్సుల్లో విదేశీ విశ్వవిద్యాలయాలకు దీటుగా భారత్ లోనూ పలు విద్యాసంస్థలు ఖ్యాతిపొందాయి. వాటిలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) బెంగళూరు ఒకటి. తాజాగా ఐఐఎం బెంగళూరుకు విశిష్ట గుర్తింపు లభించింది. భారత్ లో బిజినెస్ మాస్టర్స్ ప్రోగ్రామ్ కోర్సు అభ్యసించేందుకు ఐఐఎం బెంగళూరును మించిన విద్యాసంస్థ మరొకటి లేదని ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ లో వెల్లడైంది. 

మాస్టర్స్ ఇన్ మేనేజ్ మెంట్ (ఎమ్ఐఎమ్) కోర్సుకు సంబంధించి భారత్ లో అత్యున్నత బిజినెస్ స్కూళ్లతో ఫైనాన్షియల్ టైమ్స్ ఓ జాబితా రూపొందించింది. ఆ జాబితాలో ఐఐఎం బెంగళూరు నెంబర్ వన్ గా నిలిచింది. అటు, అంతర్జాతీయ ర్యాంకుల్లోనూ ఐఐఎం బెంగళూరు ముందంజ వేసింది. 2021లో 47వ స్థానంలో ఉన్న ఈ బెంగళూరు విద్యాసంస్థ 2022లో 31వ స్థానానికి ఎగబాకడం విశేషం. 

దీనిపై ఐఐఎం బెంగళూరు డైరెక్టర్ ఫ్రొ.రిషికేశ టి కృష్ణన్ స్పందిస్తూ, తాజా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం లభించడం ద్వారా ఐఐఎం బెంగళూరు ఖ్యాతి మరింత విస్తరిస్తుందని, అందరి దృష్టిని ఆకర్షించడంలో ఈ ర్యాంకు ప్రముఖ పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. 

ఎంబీఏ దిశగా ఐఐఎం బెంగళూరు అందించే రెండేళ్ల పూర్తిస్థాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మేనేజ్ మెంట్) కోర్సు ఫైనాన్షియల్ టైమ్స్ జాబితాలో అగ్రస్థానానికి కారణమైంది.


More Telugu News