కారు ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో... మూడు కిలోమీటర్లు పరుగెత్తుకెళ్లి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుడు

  • బెంగళూరులో తీవ్రస్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులు
  • సర్జరీ చేసేందుకు వెళుతూ ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన డాక్టర్ 
  • కారు, డ్రైవర్ ను అక్కడే వదిలేసి పరుగు
  • సకాలంలో ఆసుపత్రికి చేరుకున్న వైనం
  • సర్జరీ విజయవంతం
వైద్యో నారాయణో హరి అని ఊరికే అనలేదు. వైద్యులే లేకపోతే సాధారణ అనారోగ్యాలు సైతం ప్రాణాంతకం అవుతాయి. చాలామంది వైద్యులు కూడా తమ వృత్తిపట్ల అంకితభావంతో మెలుగుతూ, వృత్తిధర్మాన్ని దైవకార్యంలా భావిస్తూ రోగులకు సేవలు అందిస్తుంటారు. అందుకు నిదర్శనమే ఈ బెంగళూరు వైద్యుడు. 

ఆయన పేరు డాక్టర్ గోవింద్ నందకుమార్. సర్జాపూర్ లోని మణిపాల్ ఆసుపత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజీ శస్త్రచికిత్సల నిపుణుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఆగస్టు 30వ తేదీన ఓ మధ్యవయస్కురాలైన మహిళకు గాల్ బ్లాడర్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిర్వహించాల్సి వచ్చింది. ఉదయం 10 గంటలకు శస్త్రచికిత్స ప్రారంభించాల్సి ఉంది. 

అయితే, బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు అన్నీఇన్నీ కావు. దాంతో డాక్టర్ గోవింద్ నందకుమార్ ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఆయన కారు అటు ముందుకు, ఇటు వెనక్కి ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఇంకేమీ ఆలోచించకుండా, కారును డ్రైవర్ కు అప్పగించి పరుగు అందుకున్నారు. దాదాపు 3 కిలోమీటర్లు పరుగెత్తి మణిపాల్ ఆసుపత్రికి చేరుకున్నారు. 

అంతేకాదు, ఎంతో ఏకాగ్రతతో ఆపరేషన్ నిర్వహించి రోగికి స్వస్థత చేకూర్చారు. సర్జరీ విజయవంతం కాగా, రోగి సకాలంలోనే కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీనిపై డాక్టర్ గోవింద్ నందకుమార్ స్పందించారు. 

తాను ప్రతిరోజూ సెంట్రల్ బెంగళూరు నుంచి మణిపాల్ ఆసుపత్రికి ప్రయాణిస్తుంటానని, ఆ రోజు కూడా యథాప్రకారమే ఇంటి నుంచి బయల్దేరానని, అప్పటికే తన బృందం సర్జరీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి తన కోసం ఎదురుచూస్తోందని వెల్లడించారు. కానీ క్రిక్కిరిసిన ట్రాఫిక్ ను చూసేసరికి ముందుకు పోవడం అసాధ్యమనిపించిందని, అందుకే కారును, డ్రైవర్ ను అక్కడే వదిలేసి పరుగెత్తానని వివరించారు.

శస్త్రచికిత్స ఆలస్యం అయ్యుంటే ఆ మహిళ తీవ్రమైన కడుపునొప్పి బారినపడేదని తెలిపారు. ఆ ఇబ్బంది రాకుండా సకాలంలో అక్కడికి చేరుకుని శస్త్రచికిత్స పూర్తి చేయగలిగానని వివరించారు. కాగా ఈ డాక్టర్ పరుగుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News