అందుకే తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన కోరుకున్నారు: ధర్మాన ప్రసాదరావు

  • పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు
  • మరోసారి రాజధానిపై తీవ్ర చర్చ
  • అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందన్న ధర్మాన
  • తెలంగాణలో మిగతా చోట్ల అభివృద్ధి జరగలేదని వెల్లడి
అమరావతి రైతుల మహా పాదయాత్ర నేపథ్యంలో, రాజధాని అంశంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. గత ఆరున్నర దశాబ్దాలుగా అభివృద్ధి అంతా హైదరాబాదులోనే జరిగిందని, రాష్ట్రంలో మిగతా చోట్ల అభివృద్ధి జరగలేదని, అందుకే తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన కోరుకున్నారని తెలిపారు. 

అదే గనుక, రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరిగి ఉంటే, ప్రత్యేక తెలంగాణ కోరుకునేవారు కాదని అన్నారు. తెలంగాణలో జరిగిన విధంగా, మళ్లీ ఎక్కడైనా 'ప్రత్యేక' డిమాండ్ రాదని ఎవరైనా చెప్పగలరా? అని నిలదీశారు.

రాజధాని సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టించడం వెనుక  ఎత్తుగడ చంద్రబాబుదేనని ధర్మాన ఆరోపించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఒకే ప్రాంతంపై దృష్టి పెడుతున్నారని ప్రశ్నించారు. 

చంద్రబాబు మనసులో స్వార్థం ఉంది కాబట్టే, అమరావతిపై దృష్టి సారించారని విమర్శించారు. చంద్రబాబు తన బంధుమిత్రులకు భూముల కేటాయింపులు చేశారని ఆరోపించారు. 

అమరావతి ఏర్పాటు వెనుక ఉన్న దురుద్దేశాలను తాము బహిర్గతం చేశామని, అసెంబ్లీలో దీనిపై చర్చ కూడా జరిగిందని వివరించారు. ఇవాళ విశాఖ రాజధాని వద్దంటే ఊరుకునే ప్రసక్తే లేదని ధర్మాన స్పష్టం చేశారు.


More Telugu News