ఆసియా కప్‌ ఫైనల్‌లో ఓటమికి కారణం నేనే: పాక్ క్రికెటర్

  • పాకిస్థాన్ కొంపముంచిన క్యాచ్‌లు
  • భానుకకు చాన్స్ ఇచ్చి ఓటమిని కొనితెచ్చుకున్న పాక్
  • భానుక ఇచ్చిన రెండు క్యాచ్‌లను జారవిడిచిన షాదాబ్
  • ఓటమికి క్షమించాలంటూ షాదాబ్ ట్వీట్
ఆసియాకప్‌లో భాగంగా గత రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన తుదిపోరులో శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించి కప్‌ను ఎగరేసుకుపోయింది. ఈ ఓటమికి తనదే బాధ్యతంటూ పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను పాకిస్థాన్ వణికించింది. 58 పరుగులకే ఐదు కీలక వికెట్లు పడగొట్టి టాపార్డర్ వెన్ను విరిచింది.

అయితే, ఆ తర్వాత అనూహ్యంగా కుదురుకున్న లంక.. పాక్ బౌలర్లను చీల్చిచెండాడింది. ముఖ్యంగా భానుక రాజపక్స వీరోచిత ఇన్నింగ్స్‌తో లంకను ఆదుకున్నాడు. దీనికి తోడు రెండు లైఫ్‌లు దొరకడంతో చెలరేగిపోయాడు. అజేయంగా 71 పరుగులు చేసి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఆరంభం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత క్రీజులో నిలబడలేకపోయింది. ప్రమోద్ మధుషన్, వనిందు హసరంగ నిప్పులు చెరిగే బంతులకు తట్టుకోలేని పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా శ్రీలంక ఖాతాలో ఆరో ఆసియాకప్ చేరింది.

ఈ ఓటమిపై పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ట్వీట్ చేస్తూ.. ‘‘క్యాచులే మ్యాచ్‌ను గెలిపిస్తాయి. క్షమించండి. ఈ ఓటమికి బాధ్యత నాదే’’ అని పేర్కొన్నాడు. కాగా, షాదాబ్ రెండు క్యాచ్‌లు వదిలేసి పాక్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు. ఆ రెండూ బ్యాట్‌తో చెలరేగిన భానుక రాజపక్సవే కావడం గమనార్హం. లాంగాన్‌లో ఒకసారి క్యాచ్‌ను జారవిడిచిన షాదాబ్.. 19 ఓవర్‌లో మరోమారు క్యాచ్ నేలపాలు కావడానికి కారణమయ్యాడు. 

భానుక మిడ్ వికెట్ మీదుగా కొట్టిన బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్దనున్న అసిఫ్ అలీ బంతిని పట్టుకుంటుండగా, అదే సమయంలో అదే క్యాచ్ పట్టేందుకు వచ్చిన షాదాబ్ బలంగా అతడిని ఢీకొట్టాడు. దీంతో క్యాచ్ నేలపాలైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షాదాబ్ మైదానాన్ని వీడాడు. నిజానికి పాక్ ఓటమికి ఈ రెండు క్యాచ్‌లో కారణం.

కాగా, ఆసియాకప్‌లో అద్భుతంగా రాణించిన నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్‌లపైనా షాదాబ్ ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్‌లో పరుగుల వరద పారించిన మహ్మద్ రిజ్వాన్‌ను కొనియాడాడు. విజయం సాధించిన శ్రీలంకకు శుభాకాంక్షలు తెలిపాడు.


More Telugu News