జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల... టాప్-10లో ఐదుగురు తెలుగు విద్యార్థులు

  • జాతీయస్థాయిలో ఆగస్టు 28న జేఈఈ పరీక్ష
  • ఫలితాలు విడుదల చేసిన ఐఐటీ బాంబే
  • రేపటి నుంచి కౌన్సెలింగ్
  • 23 ఐఐటీల్లో 16,598 సీట్లకు కౌన్సెలింగ్
జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల టాప్-10లో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉండడం విశేషం. పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డికి 2వ ర్యాంకు, వంగపల్లి సాయి సిద్ధార్థకు 4వ ర్యాంకు, విజయవాడ విద్యార్థి పొలిశెట్టి కార్తికేయకు 6వ ర్యాంకు, ధీరజ్ కురుకుందకు 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞానమహేశ్ కు 10వ ర్యాంకు లభించాయి.

జేఈఈ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, రేపటి నుంచి ఐఐటీ, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ షురూ కానుంది. ఇందులో భాగంగా దేశంలోని 23 ఐఐటీల్లో 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాప్-10 ర్యాంకర్లు వీరే...
1. ఆర్కే శిశిర్
2. పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి
3.  థామస్ బిజు చీరంవెల్లి
4. వంగపల్లి సాయి సిద్ధార్థ
5. మయాంక్ మోత్వానీ
6. పొలిశెట్టి కార్తికేయ
7. ప్రతీక్ సాహు
8. ధీరజ్ కురుకుంద
9. మహిత్ గఢీవాలా
10. వెచ్చా జ్ఞాన మహేశ్


More Telugu News