బరువు పెరగాలంటే ఏం చేయాలి?.. మంచి ఆరోగ్యంతో తగిన బరువు ఉండేందుకు వైద్య నిపుణుల సూచనలివీ

  • ఏది పడితే అది తినేస్తే లావైపోతామన్న ఆలోచన మంచిదికాదంటున్న నిపుణులు
  • పద్ధతిగా పోషకాలు అందేలా మంచి ఆహారం తీసుకోవాలని సూచన
  • భిన్న రకాల పండ్లు, కూరగాయలు తినడం మంచిదని వెల్లడి
ఇటీవలి కాలంలో జంక్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ కారణంగా అవసరం లేకున్నా బరువు పెరిగిపోతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. మరోవైపు కొంత మంది కావాలనుకున్నా బరువు పెరగలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచీ ఉన్న కొన్ని రకాలా ఆహార అలవాట్లు, శారీరక, మానసిక సమస్యలే దీనికి కారణం. ఇలా వయసు, ఎత్తుకు తగినంత బరువు లేకపోయినా కూడా కొన్నిరకాల సమస్యలు వస్తాయి. శరీరంలో సత్తువ ఉండదు. నీరసం, ఆయాసం వంటి సమస్యలూ తలెత్తుతుంటాయి. ఇలాంటివారు మానసికంగా కూడా బలహీనంగా ఉంటుంటారు. చదువుపై, పనిపై ఏకాగ్రత చూపలేకపోతుంటారు.

ఈ క్రమంలోనే వయసు, ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలని వైద్య, పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగని బరువు పెరిగేందుకు ఏదిపడితే అది తినడం మరిన్ని దుష్ప్రభావాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరిగేందుకు అనుసరించాల్సిన విధానాలను సూచిస్తున్నారు.


శరీరానికి ఎక్కువ కేలరీలు అందేలా చూసుకోండి
  ఎవరైనా బరువు పెరగాలనుకుంటే.. శరీరం ఖర్చు చేసేదానికన్నా ఎక్కువ కేలరీలు అందాలి. అందువల్ల మనం రోజువారీ చేస్తున్న పనులు ఏమిటి, వాటికి ఎంత వరకు శక్తి ఖర్చవుతుందన్నది అంచనా వేసుకోవాలని.. అంతకు మించిన శక్తి అందేలా ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాలాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవాలని.. ఎండాకాలంలో అయితే మరికొంత ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. సహజమైన పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఆలోచించి తినండి
బరువు పెరగాలనుకున్నంత మాత్రాన ఏది పడితే అది, ఎంత పడితే అంత తినేయవచ్చన్న భావన ఉండొద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి ఎక్కువ కేలరీలు అందించే ఆహారం వల్ల బరువు పెరిగినా.. చక్కెరలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం వంటివి అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి వ్యాధుల బారినపడతారని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

భిన్నరకాల ఆహారం తీసుకోండి
శరీరం బరువు పెరగడమంటే కండరాలు సహా చాలా రకాల కణజాలం పెరగాలి. శరీర బరువుకు తగినట్టు ఎముకలూ మరింత దృఢంగా మారాల్సి ఉంటుంది. అందువల్ల శరీరంలో అన్ని రకాల అవసరాలకు సరిపోయేలా పోషకాలు, మినరల్స్‌ ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏవో కొన్నిరకాలకే పరిమితం కాకుండా.. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు(మాంసాహారులైతే చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లు అన్ని వెరైటీలు) తీసుకోవాలని సూచిస్తున్నారు.

స్నాక్స్‌ గా మంచి ఫుడ్‌ అలవాటు చేసుకోండి
బరువు పెరగాలన్న ఉద్దేశం ఉన్నవారు కాస్త ఎక్కువ ఆహారం తీసుకోవడంలో భాగంగా స్నాక్స్‌ అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే స్నాక్స్‌ అనగానే ఫాస్ట్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ జోలికి వెళ్ల వద్దని.. మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా బాదాం, కాజు, వాల్‌ నట్స్‌, అంజీర్‌, పిస్తా, వివిధ రకాల పండ్ల ముక్కలతో కూడిన సలాడ్లను స్నాక్స్‌ గా తీసుకోవాలని సూచిస్తున్నారు.

తగినంతగా ద్రవ పదార్థాలు తీసుకోండి
 ఎంత ఆహారం తీసుకున్నా.. శరీరానికి తగినంతగా మంచి నీళ్లు అందకపోతే ప్రయోజనం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాలం ఏదైనా సరే సరైన స్థాయిలో ద్రవ పదార్థాలను తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. బరువు పెరిగే ఉద్దేశం ఉన్నవారు మామూలు మంచినీళ్లతోపాటు పాలతో చేసే సలాడ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. కూల్‌ డ్రింక్స్‌, ఇతర కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌, కృత్రిమ పళ్ల రసాలు తీసుకోవద్దని.. వాటిలోని రసాయనాలు, చక్కెరలు ఆరోగ్యానికి హాని చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.

వ్యాయామం, వైద్యుల సహా తప్పనిసరి
ఆహారం ఎక్కువగా తీసుకుంటూ బరువు పెరగడంతోపాటు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా శక్తివంతంగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక బరువు తక్కువగా ఉన్నవారిలో పలు రకాల అనారోగ్యాలు, శారీరక సమస్యలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువేనని.. అందువల్ల వైద్యులను సంప్రదించి, తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వైద్యుల సలహా మేరకే ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిదని స్పష్టం చేస్తున్నారు.


More Telugu News