పొద్దున మూడింటికే జిమ్‌ కు వెళ్లి.. తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ. రక్షించిన పోలీసులు.. వీడియో ఇదిగో

  • ఉదయం మూడు గంటలకే జిమ్‌ కు వెళ్లిన మహిళ
  • ఇన్వర్షన్‌ టేబుల్‌ పై వ్యాయామం చేస్తుండగా తలకిందులుగా ఇరుక్కుపోయిన వైనం
  • జిమ్‌ లో ఎవరూ లేకపోవడంతో కాపాడాలంటూ అత్యవసర సర్వీసుకు ఫోన్‌
  • కాసేపటికి వచ్చి పరికరం నుంచి ఆమెను లేవదీసిన పోలీసులు
అమెరికాలోని ఓహియోకు చెందిన మహిళ.. పేరు క్రిస్టిన్‌. బరువు తగ్గాలనుకుందో, మరేమిటోగానీ ఇటీవల వ్యాయామంపై బాగా దృష్టి పెట్టింది. ఓ రోజు తెల్లవారక ముందే మూడు గంటలకే జిమ్‌ కు వెళ్లింది. వ్యాయామం చేయడం మొదలుపెట్టింది. అందులో ఇన్వర్షన్‌ టేబుల్‌ (ఊయలలా కాళ్లు, తల భాగాలు పైకి కిందకు చేసే పరికరం)పై కూర్చుని వ్యాయమం చేస్తోంది. ఇంతలో ఆమె తలవైపు భాగం పూర్తిగా కిందికి వెళ్లిపోయి.. కాళ్లు పైకి లేచాయి.

కాళ్లు ఇరుక్కుపోయి..
ఇన్వర్షన్‌ టేబుల్‌ పాదాల భాగంలో కాళ్లు ఇరుక్కుపోవడంతో ఆమె అలాగే తలకిందులుగా ఉండాల్సి వచ్చింది. ఎలాగోలా బయటపడటానికి కాసేపు ప్రయత్నం చేసింది. కానీ లేవలేకపోయింది. ఆ సమయంలో జిమ్‌ లో ఎవరూ లేకపోవడంతో తనను రక్షించేవారు లేకుండా పోయారు. చివరికి తన చేతికి ఉన్న స్మార్ట్‌ వాచ్‌ సాయంతో ఎమర్జెన్సీ సర్వీస్‌ కు ఫోన్‌ చేసింది. జిమ్‌ లో తాను ఇరుక్కుపోయిన విషయాన్ని చెప్పి రక్షించాలని కోరింది.

కాసేపటికే పోలీసులు జిమ్‌ వద్దకు చేరుకుని క్రిస్టిన్‌ ను ఆ పరికరం నుంచి పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసిన వీడియోను లక్షన్నర మందికిపైగా వీక్షించారు.
  • పోలీసులు ఈ సందర్భంగా చేసిన కామెంట్‌ కూడా చిత్రమే. ఎందుకంటే తమ జీవితంలో అత్యంత సులువుగా రక్షించిన ఘటన ఇదేనని వారు నవ్వుతూ పేర్కొన్నారు.
  • ఎందుకంటే పోలీసులు వచ్చాక చేసిన పని ఏమిటంటే.. జస్ట్‌ క్రిస్టిన్‌ ఇరుక్కుపోయిన పరికరంలో కాళ్లవైపు ఉన్న భాగాన్ని పట్టుకుని కిందికి జరపడం మాత్రమే. వెంటనే క్రిస్టిన్‌ కిందికి దిగి పక్కకు వెళ్లిపోయింది.



More Telugu News