ప్రభాస్‌తో కృష్ణంరాజు ఈ సినిమాలు తీయాలనుకున్నారు.. కలలు నెరవేరకుండానే కన్నుమూత

  • భక్తకన్నప్ప, మన ఊరి పాండవులు సినిమాలను ప్రభాస్‌తో రీమేక్ చేయాలనుకున్న కృష్ణంరాజు
  • విశాల నేత్రాలు నవల ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించే యోచన 
  • భక్త కన్నప్ప సినిమాకు తానే దర్శకత్వం వహించాలనుకున్న వైనం
  • గవర్నర్‌గా పనిచేయాలనీ కోరిక
ఈ తెల్లవారుజామున కన్నుమూసిన ప్రముఖ నటుడు కృష్ణంరాజు తన కలలు కొన్నింటిని నెరవేర్చుకోలేకపోయారు. కృష్ణంరాజు కెరియర్‌లోనే మైలురాయిగా మిగిలిపోయిన ‘భక్త కన్నప్ప’ సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేద్దామని అనుకున్నారు. స్క్రిప్ట్ కూడా తయారుచేసుకున్నారు. సొంత బ్యానర్‌పైనే తెరకెక్కించాలని, దానికి తానే దర్శకత్వం వహించాలని భావించారు. అదే సమయంలో ప్రభాస్ సినిమాలతో బిజీ అయిపోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా మారడంతో ఆ సినిమా ఆలోచన అక్కడితో ఆగిపోయింది. అలాగే, ప్రభాస్‌తోనే ‘ఒక్క అడుగు’ పేరుతో మల్టీస్టారర్ సినిమాను తీయాలని అనుకున్నారు. 

ఇందులో ప్రభాస్ కూడా ఓ పాత్ర చేయాల్సి ఉంది. పరిశ్రమలోని కొందరు పెద్ద రచయితలు కథపై కసరత్తు కూడా చేశారు. సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఆ తర్వాత మాత్రం అడుగు ముందుకు పడలేదు. అలాగే, ‘విశాల నేత్రాలు’ నవల ఆధారంగా సినిమా తీయాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజుకు గవర్నర్‌గా పనిచేయాలన్న కోరిక ఉండేది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనను గవర్నర్‌గా పంపించబోతోందన్న వార్తలు కూడా వచ్చినా అవి వార్తలుగానే మిగిలిపోయాయి. ‘మన ఊరి పాండవులు’ సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేయాలని అనుకున్నారు. అలాగే, ప్రభాస్ పెళ్లి చూడాలని పరితపించారు. ఇవేవీ చూడకుండానే కన్నుమూశారు.


More Telugu News