యాంటీ ఆక్సిడెంట్ల గురించి నిపుణులు చెబుతున్న ప్రయోజనాలు ఇవీ...!

  • శరీరంలో ఆక్సిడేషన్ వల్ల ఏర్పడే స్ట్రెస్ ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు
  • రోగాలు రాకుండా దూరంగా ఉంచేందుకు తోడ్పడే రసాయనాలు
  • కళ్లు, మెదడు పనితీరును మెరుపర్చేందుకు తోడ్పాటు
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు తరచూ చెబుతుంటారు. అవి శరీరంలో విష పదార్థాలను తొలగించి, మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయని అంటుంటారు. ఏయే కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయో చెబుతుంటారు. మరి అసలు యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏమిటి, అవి చేసే పని ఏమిటి? వాటితో ఉన్న ప్రయోజనాలు ఏమిటన్న దానిపై వైద్య నిపుణులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇవీ..

యాంటీ ఆక్సిడెంట్లు అంటే..?
శరీరంలో నిత్యం జరిగే జీవక్రియల్లో కొన్నిరకాల రసాయనాలు ఉత్పత్తి అయి.. ఆక్సీకరణ (ఆక్సిడేషన్‌) చర్యలను ప్రేరేపిస్తాయి. ఈ చర్యలు ఒకదానివెనుక ఒకటి గొలుసుకట్టుగా జరుగుతూ పోతాయి. ఈ చర్యలు ఫ్రీర్యాడికల్స్‌ (స్వీయ నియంత్రణ కోల్పోయిన కణాలు) ఉద్భవించడానికి కారణమై.. వివిధ అవయవాల్లో శరీర కణాలను దెబ్బతీస్తాయి. కేన్సర్లకూ దారితీస్తాయి.. ఇలాంటి ప్రమాదకర రసాయనాలు, ఫ్రీర్యాడికల్స్‌ ను అడ్డుకుని నిర్వీర్యం చేసేవే యాంటీ ఆక్సిడెంట్లు. చాలా రకాల రసాయన పదార్థాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

ఏయే విటమిన్లు, ప్రొటీన్లు.. యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి?
విటమిన్‌ సి, విటమిన్‌ ఈ, సెలీనియం, బీటా కెరోటిన్‌ వంటి కెరోటినాయిడ్‌ ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. రోజూ ఇవి అందేలా ఆహారం తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా పండ్లు, తాజా కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. ఆహార పదార్థాల పరంగా చెప్పాలంటే.. బెర్రీస్‌, క్యారెట్లు, గ్రేప్స్‌, కాఫీ, గ్రీన్‌ టీ, పసుపు, ఉల్లి, మిరపకాయలు, అవకాడో, ముల్లంగి, కేల్‌, నిమ్మజాతి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

1. ఆక్సిడేషన్ ఒత్తిడిని తగ్గిస్తుంది
శరీరంలో వివిధ జీవ క్రియలు జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ కు స్పందించే కొన్నిరకాల విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. శరీరం వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. కానీ ఒక్కోసారి వాటి స్థాయి పెరిగిపోయి.. శరీరంలో ఒత్తిడి (ఆక్సిడేటివ్ స్ట్రెస్) పెరుగుతుంది. ఇది కేన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలకు కారణం అవుతుంది. అదే యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవడం వల్ల విష పదార్థాలను తొలగించి.. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి.

2. వ్యాధుల నియంత్రణకు తోడ్పడతాయి
 మన శరీరంలో వ్యాధులను నియంత్రించే సామర్థ్యం యాంటీ ఆక్సిడెంట్లతో ముడిపడి ఉంటుంది. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు వివిధ కణజాలాలు సమర్థవంతంగా పనిచేసేందుకు దారి వేస్తాయి. ఇది వివిధ వ్యాధులను ఎదుర్కొనేందుకు శరీరానికి అదనపు శక్తిని ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి తగిన స్థాయిలో అందితే.. ట్యూమర్లు, కేన్సర్, డయాబెటిస్, గుండె కవాటాల వ్యాధులు నియంత్రణలో ఉంటున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది కూడా.

3. కంటి ఆరోగ్యానికి మంచిది
యాంటీ ఆక్సిడెంట్లు తగిన స్థాయిలో శరీరానికి అందితే.. కంటి ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వయసు మీదపడిన కొద్దీ కంటి సామర్థ్యం తగ్గిపోవడం, కేటరాక్ట్ వంటి సమస్యలు రావడాన్ని బీటా కెరోటిన్, విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు తోడ్పడుతాయని స్పష్టం చేస్తున్నారు.

4. మెదడు పనితీరు మెరుగుపడుతుంది
 శరీరంలో అన్ని అవయవాల కంటే ఎక్కువగా మెదడే ఆక్సిజన్ ను వినియోగించుకుంటుంది. ఈ కారణంతో ఫ్రీ ర్యాడికల్స్ బారిన పడే ప్రమాదం కూడా మెదడుకే ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో ఫ్రీర్యాడికల్స్ పూర్తి నియంత్రణలో ఉండి మెదడు ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు మెమరీ లాస్, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా నియంత్రిస్తాయని స్పష్టం చేస్తున్నారు.

5. మానసిక ఆరోగ్యమూ బాగుంటుంది
మెదడు ఆరోగ్యం బాగుండటం అంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుండటం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడు ఆరోగ్యం ఎంత బాగున్నా శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యలను తగ్గించడంతోపాటు శరీరంలో జీవక్రియలను మెరుగుపర్చి ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడతాయని పేర్కొంటున్నారు.

6. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ (వాపు) తగ్గుతుంది
శరీరం ఏదైనా అనారోగ్యాలతో పోరాడుతున్నప్పుడు వాపు (ఇన్ ఫ్లమేషన్) వస్తుంటుంది. నిజానికి ఇది ఆరోగ్య సమస్య కాకపోయినా.. దీనివల్ల శారీరకంగా అస్వస్థతగా అనిపిస్తుంటుంది. తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేసినట్టు ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ లక్షణాలను తగ్గించడంతోపాటు.. అనారోగ్యంతో పోరాడటానికి తోడ్పడతాయి.

7. వృద్ధాప్య లక్షణాలను నియంత్రణలో ఉంచుతాయి
 కాలం గడిచిన కొద్దీ మన వయసు పెరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు అనారోగ్యాలు, వాతావరణ పరిస్థితులు, జీవన శైలి కారణంగా.. వయసు కంటే వేగంగా వృద్ధాప్య లక్షణాలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిని యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వయసు కంటే తక్కువగా కనిపించేందుకూ, శరీరం యంగ్ గా తోడ్పడుతాయని  అంటున్నారు.

8. చర్మం ఆరోగ్యంగా, నిగారింపుతో ఉంటుంది
యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కణాలను శుభ్రం చేసేందుకు తోడ్పడుతాయి. ఈ క్రమంలో చర్మానికి మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తగిన స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందితే.. చర్మం ఆరోగ్యంగా, నిగారింపుతో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. చర్మం నల్లగా, మందంగా మారడం, పాలిపోవడం వంటి సమస్యలకు విటమిన్ సి, విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతంగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.

9. జీర్ణ వ్యవస్థ మైక్రోబియం సరిగా ఉండేలా చూస్తాయి
యాంటీ ఆక్సిడెంట్లు మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతాయని.. జీర్ణ వ్యవస్థలో భాగమైన ఆరోగ్యకర బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నపేగుల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడం వల్ల మంచి బ్యాక్టీరియా స్థాయులు తగిన స్థాయిలో ఉంటాయని వివరిస్తున్నారు.



More Telugu News