తాత‌య్య నాకు స‌మ‌యం కేటాయించ‌ట్లేదు!.. మ‌న‌వ‌రాలి సందేశాన్ని పోస్ట్ చేసిన ర‌ఘువీరారెడ్డి!

  • వైఎస్సార్ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన ర‌ఘువీరా
  • ప్ర‌స్తుతం సొంతూళ్లో రైతుగా మారిపోయిన వైనం
  • త‌న మ‌న‌వ‌రాలి వాట్సాప్ మెసేజ్‌ను పోస్ట్ చేసిన మాజీ మంత్రి
రాజ‌కీయాల‌ను వ‌దిలేసి సొంతూరు చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ర‌ఘువీరారెడ్డి శుక్ర‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్‌ను పెట్టారు. త‌న‌కు తాత‌య్య స‌మ‌యం కేటాయించ‌డం లేదని, తాత‌య్య త‌న‌తో ఆడుకోవ‌డం లేదంటూ ర‌ఘువీరారెడ్డి మ‌న‌వ‌రాలు వాట్సాప్‌లో ఓ సందేశం పెట్టింద‌ట‌. దానినే సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన ర‌ఘువీరారెడ్డి... త‌న వ‌ల్ల త‌న మ‌న‌వ‌రాలు బాధ ప‌డుతోందంటూ ఓ కామెంట్ జ‌త చేశారు. 

అనంత‌పురం జిల్లా నీల‌కంఠాపురానికి చెందిన ర‌ఘువీరారెడ్డి సుదీర్ఘ కాలం పాటు రాజ‌కీయాల్లో కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేబినెట్‌లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన ర‌ఘువీరారెడ్డి... వైఎస్సార్ హ‌యాంలో ప్రారంభ‌మైన ప‌లు కీల‌క ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌లోనూ భాగ‌స్వామిగా ఉన్నారు. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత కూడా మంత్రిగా కొన‌సాగిన ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీసీసీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించారు. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ప‌రాజయంతో పీసీసీ ప‌ద‌విని వ‌దిలేసిన ర‌ఘువీరారెడ్డి... సొంతూరు చేరి రైతుగా మారిపోయారు.


More Telugu News