నైపుణ్యం పరంగా కోహ్లీ నన్ను మించిన ఆటగాడు: గంగూలీ

  • మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ
  • ఆసియా కప్ లో చెలరేగిన వైనం
  • విధ్వంసక సెంచరీ నమోదు
  • కోహ్లీ తనకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడతాడన్న గంగూలీ
ఆసియా కప్ ద్వారా మళ్లీ ఫామ్ లోకి రావడమే కాదు, విధ్వంసక సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పొగడ్తల జల్లు కురిపించాడు. నైపుణ్యం పరంగా కోహ్లీ తనకంటే ఎంతో మెరుగైన ఆటగాడని కితాబునిచ్చారు. రిటైరయ్యే నాటికి కోహ్లీ టీమిండియా తరఫున తన కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడతాడని గంగూలీ అభిప్రాయపడ్డారు. 

"ఈ పోలిక ఆటగాడిగా అతడి నైపుణ్యం గురించే. కోహ్లీ నన్ను మించిన ప్రతిభావంతుడని అనుకుంటున్నాను. మేం భిన్న తరాలకు చెందినవాళ్లం. ఎంతో క్రికెట్ ఆడాం. నా తరంలో నేను ఆడాను. కోహ్లీ ఇంకా ఆడుతూనే ఉన్నాడు. బహుశా అతడు నాకంటే ఎక్కువ మ్యాచ్ లే ఆడతాడని అనుకుంటున్నా. నిజంగా అతడు అద్భుతం" అని కొనియాడారు. 

కోహ్లీకి గంగూలీ బహిరంగంగా మద్దతు పలకడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కోహ్లీకి బాసటగా నిలిచాడు. ఆసియా కప్ ముందు కూడా ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ, కోహ్లీ ఒక అగ్రశ్రేణి ఆటగాడు అని, ఈ ఆసియా కప్ తో అతడు మళ్లీ ఫామ్ లోకి వస్తాడని గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశారు.


More Telugu News