వినాయ‌క నిమ‌జ్జ‌నం వేళ‌... కొత్త రికార్డులు నెల‌కొల్పిన హైద‌రాబాద్ మెట్రో రైల్‌

  • నిన్న ఒక్క రోజే మెట్రోలో ప్ర‌యాణించిన వారు 4 ల‌క్ష‌ల మంది
  • గ‌ణేశ్ శోభాయాత్ర సంద‌ర్భంగా రాత్రి 2 దాకా న‌డిచిన మెట్రో సేవ‌లు
  • ఖైర‌తాబాద్ స్టేష‌న్‌లో 40 వేల మంది మెట్రో దిగ‌గా, 22 వేల మంది ఎక్కిన‌ట్లు అధికారుల వెల్ల‌డి
భాగ్య‌న‌గ‌రి ర‌వాణాలో కీల‌క‌మైన వ్య‌వ‌స్థ‌గా సేవ‌లందిస్తున్న హైద‌రాబాద్ మెట్రో రైల్ శుక్ర‌వారం స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పింది. గ‌ణేశ్ శోభాయాత్ర సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు హుస్సేన్ సాగ‌ర్‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో భ‌క్తుల సౌక‌ర్యార్థం శుక్ర‌వారం అర్థ‌రాత్రి దాకా మెట్రో సేవ‌లు న‌డిచిన సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంగా ఒకే రోజు అత్య‌ధిక సంఖ్య‌లో జ‌నం ప్ర‌యాణించిన విష‌యంలో హైద‌రాబాద్ మెట్రో న‌యా రికార్డుల‌ను న‌మోదు చేసింది.

శుక్ర‌వారం ఒక్క‌రోజే హైద‌రాబాద్ మెట్రోలో ఏకంగా 4 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించిన‌ట్లుగా అధికారులు చెప్పారు. మియాపూర్‌- ఎల్బీ న‌గ‌ర్ కారిడార్‌లో 2.46 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించ‌గా... నాగోల్‌- రాయ‌దుర్గం కారిడార్‌లో 1.49 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించారు. జేబీఎస్‌- ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ప్ర‌యాణించారు. ఇక ఆయా స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల వివ‌రాల్లోకెళితే... అత్య‌ధికంగా 22 వేల మంది ఖైర‌తాబాద్ స్టేష‌న్‌లో రైలు ఎక్కితే... 44 వేల మంది ఆ స్టేష‌న్‌లో రైలు దిగారు.


More Telugu News