మబ్బు తొడిగిన కిరీటం.. మేఘాలను చుట్టేస్తూ అద్భుతమైన ఇంద్ర ధనుస్సు.. వీడియో ఇదిగో

  • చైనాలోని హైనాన్‌ ప్రావిన్స్‌లో ఏర్పడిన వింత
  • వేగంగా మేఘాలు ఏర్పడే క్రమంలో రూపొందే క్యాప్‌ క్లౌడ్స్‌
  • వాటిలోని మంచు కణాలపై సూర్యకాంతి వివర్తనంతో అద్భుతమైన దృశ్యం
ఆకాశంలో మేఘాలు ఏర్పడటం సాధారణమే. అందులోనూ అప్పుడప్పుడూ చిత్రవిచిత్రమైన ఆకారాల్లో, కొన్ని చిన్నవిగా, మరికొన్ని భారీగా ఏర్పడటమూ తెలిసినదే. కానీ టోపీల్లా, గుండ్రంగా కాస్త ఎత్తుగా ఏర్పడే క్యాప్‌ క్లౌడ్స్‌ మాత్రం అరుదు. అలాంటి ఓ క్యాప్‌ క్లౌడ్‌ అంతకన్నా అరుదైన ఘటనకు కారణమైంది. ఇంద్ర ధనుస్సును కిరీటంలా ధరించి అలరించింది.

చైనాలోని హైకూ నగరంలో
చైనాలోని హైనన్‌ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్ర ధనుస్సు ఏర్పడింది. అది మామూలు ఇంద్ర ధనుస్సు కాదు. మేఘాలు తొడుక్కున్న అద్భుతమైన కిరీటం వంటి ఇంద్ర ధనుస్సు. ఇది చూసిన ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వెంటనే ఫొటోలు, వీడియోలు తీశారు. తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో అప్‌ లోడ్‌ చేయగా.. వైరల్‌ గా మారాయి. ట్విట్టర్‌ లోని సన్‌ లిట్‌ రెయిన్‌ పేరిట ఉన్న ఖాతాలో పోస్ట్‌ అయిన వీడియోకు ఏకంగా 2.87 కోట్ల వ్యూస్‌ నమోదవడం గమనార్హం. వేలాది లైకులు, షేర్లు కూడా వచ్చాయి.

ఇలా ఇంద్ర ధనుస్సు ఎలా ఏర్పడింది?
సాధారణంగా మేఘాల్లోని నీటి బిందువులు, మంచు స్పటికాలపై పడిన సూర్య కాంతి వివర్తనం చెంది ఇంద్ర ధనుస్సులు ఏర్పడుతుంటాయి. ఇదే తరహాలో మేఘంలో జరిగినప్పుడు అవి వివిధ రంగులు వెదజల్లుతుంటాయి. చైనాలో కనిపించిన తాజా మేఘాన్ని క్యాప్‌ క్లౌడ్స్‌ లేదా స్కార్ఫ్‌ క్లౌడ్స్‌ గా పిలుస్తారు. ఏదైనా ఓ ప్రాంతంలో అకస్మాత్తుగా క్యుములో నింబస్‌ మేఘాలు రూపొందే క్రమంలో.. గాలి వేగంగా ఎత్తుకు చేరుకుని టోపీ లేదా గొడుగు ఆకారంలో మేఘాలు ఏర్పడుతాయి. వీటినే క్యాప్‌/స్కార్ఫ్‌ క్లౌడ్స్‌ అంటారు. ఇలాంటి క్యాప్‌ క్లౌడ్‌ పై ఏర్పడిన ఇంద్ర ధనుస్సు వైరల్‌ గా మారింది.


More Telugu News