నాదల్ వారసుడు స్పెయిన్ యువ కెరటం అల్కరాజ్.. యూఎస్ ఓపెన్ ఫైనల్లో ప్రవేశం

  • తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన 19 ఏళ్ల అల్కరాజ్
  • సెమీఫైనల్లో అమెరికా ఆటగాడు తియఫో పై గెలుపు
  • రేపు కాస్పర్ రూడ్ తో ఫైనల్లో తలపడనున్న అల్కరాజ్
స్పెయిన్ బుల్, దిగ్గజ ప్లేయర్ రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ లో నిరాశ పరిచినప్పటికీ అదే దేశానికి చెందిన యువ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్ సత్తా చాటాడుతున్నాడు. 19 ఏళ్ల అల్కరాజ్ నాదల్ వారసుడిగా గుర్తింపు అందుకుంటున్నాడు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ నాలుగో ర్యాంక్ కు దూసుకొచ్చిన ఈ యువ క్రీడాకారుడు కెరీర్ లో మొదటి గ్రాండ్ స్లామ్ నెగ్గేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ లో అతను ఫైనల్ కు దూసుకెళ్లాడు. శనివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ అల్కరాజ్ 6-7 (6/8), 6-3, 6-1, 6-5 (5/7), 6-3 తో 22వ సీడ్ ఫ్రాన్సెస్ తియఫో పై ఉత్కంఠ విజయం సాధించాడు. 

ప్రీ క్వార్టర్స్ లో నాదల్ ను ఓడించిన తియఫో ఇప్పుడు అదే స్పెయిన్ కు చెందిన యంగ్ స్టర్ అల్కరాజ్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం అల్కరాజ్ కు ఇదే మొదటి సారి కావడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో అల్కరాజ్... నార్వేకు చెందిన ఐదో సీడ్ కాస్పర్ రూడ్ తో అమీతుమీ తేల్చుకోబోతున్నాడు. మరో సెమీస్ లో రూడ్ 7-6 (7/5), 6-2, 5-7, 6-2 తేడాతో 27వ సీడ్ కారెన్ కచనోవ్ (రష్యా)పై నాలుగు సెట్లలో విజయం సాధించాడు. రూడ్ కు ఇది రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్. ఈ ఏడాది తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరుకున్నాడు. కానీ, అక్కడ నాదల్ జోరును అడ్డుకోలేక రన్నరప్ గా నిలిచాడు.


More Telugu News