'బ్రహ్మాస్త్ర' దర్శకుడ్ని మేధావి అని పిలవడం హాస్యాస్పదంగా ఉంది: కంగన

  • రణబీర్, అలియా జంటగా బ్రహ్మాస్త్ర
  • అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ చిత్రం
  • సెప్టెంబరు 9న రిలీజ్
  • విమర్శనాస్త్రాలు సంధించిన కంగనా
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాతల్లో ఒకరైన కరణ్ జొహార్ లపై ప్రముఖ నటి కంగన రనౌత్ విమర్శనాస్త్రాలు సంధించారు. 

దర్శకుడు అయాన్ ముఖర్జీని మేధావి అని పిలుస్తుండడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బ్రహ్మాస్త్ర సినిమా తీసేందుకు 12 ఏళ్ల సమయం పట్టిందని, ఈ సినిమాకు 12 మంది కెమెరామన్లు మారారని, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు మారారని కంగనా పేర్కొన్నారు. అతడి మూలంగా రూ.600 కోట్ల ప్రొడక్షన్ డబ్బు బూడిదలో పోసిన పన్నీరైందని, అతడు మేధావి ఎలా అవుతాడని విమర్శించారు. అతడిని ఎవరైనా జీనియస్ అంటే వారిని జైల్లో పెట్టాలని పిలుపునిచ్చారు. 

ఇక, కరణ్ జొహార్ పైనా ఆమె ఘాటుగా స్పందించారు. టాలెంట్ ఉన్నవాళ్లతో సినిమా చేయకుండా, సినిమా ప్రమోషన్ కోసం దక్షిణాదివాళ్లపై ఆధారపడ్డాడని విమర్శించారు. తన సినిమాల స్క్రిప్టులు ఎలా ఉన్నాయో పట్టించుకోని కరణ్ కు ఇతరుల లైంగిక జీవితాలపై ఆసక్తి ఎక్కువని ఎద్దేవా చేశారు. 

తన సినిమాలకు రివ్యూలు, రేటింగులు, వసూళ్ల వివరాలు... ఇలా అన్నీ కొనుగోలు చేస్తుంటాడని ఆరోపించారు. అంతేకాదు, బ్రహ్మాస్త్ర సినిమా చెత్తగా ఉందంటూ పలు మీడియా సంస్థలు ఇచ్చిన రేటింగులను కూడా కంగనా సోషల్ మీడియాలో పంచుకున్నారు.


More Telugu News