ఒక్క సెంచరీ కూడా చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లీకే సాధ్యమైంది..: గంభీర్

  • యువ క్రికెటర్లలో వేరొకరికి ఇది అసాధ్యమన్న గంభీర్
  • అంతకుముందు చేసిన పరుగులే ఆదుకున్నట్టు వ్యాఖ్య
  • ఎంతో మంది క్రికెటర్లు లోగడ చోటు కోల్పోయారని వెల్లడి
  సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మూడేళ్ల పాటు ఒక్క సెంచరీ చేయకపోయినా అతడు తన స్థానాన్ని కాపాడుకోవడాన్ని వేలెత్తి చూపించాడు. మరో క్రికెటర్ అయితే సెంచరీ చేయకపోతే జట్టు నుంచి ఉద్వాసనకు గురై ఉండేవాడని వ్యాఖ్యానించాడు.

విరాట్ కోహ్లీ 2019 నవంబర్ నుంచి 2022 సెప్టెంబర్ 8 వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క సెంచరీ చేయలేదు. అంతేకాదు, మధ్యలో మూడేళ్ల పాటు అతడి కెరీర్ వైఫల్య బాటలో సాగింది. జట్టును గెలిపించే ఇన్నింగ్స్ లు అతడి నుంచి రాలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు అతడిపై వచ్చాయి. అయినా, కోహ్లీ విమర్శలకు ఏనాడూ స్పందించలేదు.

‘‘ఇది మూడు నెలలు కాదు, మూడేళ్లు అని అర్థం చేసుకోవాలి. మూడేళ్లు అంటే చాలా సుదీర్ఘ కాలమే. దీన్ని నేనేమంత పెద్దది చేయాలనుకోవడం లేదు. కానీ, అంతకుముందు చేసిన పరుగుల వల్లే అతడు కొనసాగగలిగాడు. కానీ, యువ క్రికెటర్లలో ఎవరూ కూడా మూడేళ్లపాటు సెంచరీ చేయకుండా జట్టులో ఉంటారని నేను అయితే అనుకోవడం లేదు’’ అని స్టార్ స్పోర్ట్స్ తో గంభీర్ అన్నాడు.

మూడేళ్ల తర్వాత ఆసియాకప్ లో కోహ్లీ ఇటీవలే సెంచరీ సాధించడం తెలిసిందే. ‘‘మొత్తానికి ఇది సరైన సమయంలో సాధ్యమైంది. టీ20 ప్రపంచకప్ ముందు అతడు వంద సాధించాడు. దీంతో అతడికి మళ్లీ చోటు లభిస్తుంది. నిజాయతీగా చెప్పాలంటే.. ఒక్క శతకం కూడా లేకుండా డ్రెస్సింగ్ రూమ్ లో మూడేళ్లు కొనసాగడం అన్నది ఎవరికీ సాధ్యం కాదు. అశ్విన్, రహానే, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లను కూడా పలు సందర్భాల్లో తప్పించారు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.


More Telugu News