బాలీవుడ్​కు ఊపిరి పోసిన ‘బ్రహ్మాస్త్ర’.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే!

బాలీవుడ్​కు ఊపిరి పోసిన ‘బ్రహ్మాస్త్ర’.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే!
  • శుక్రవారం భారీ అంచనాలతో విడుదలైన చిత్రం
  • అన్ని భాషల్లో కలిపి రూ.36 కోట్లు వసూలు చేసినట్లు అంచనా
  • సెలవు కాని రోజు బాలీవుడ్ చిత్రానికి అత్యధిక ఓపెనింగ్ ఇదే
వరుస ఫెయిల్యూర్స్, బాయ్ కాట్ సెగ తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కోలుకున్నట్టు కనిపిస్తోంది. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ (తెలుగులో బ్రహ్మాస్త్రం) సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోసింది. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జొహర్ నిర్మించారు. ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేయడం ‘బ్రహ్మస్త్ర’కు కలిసొచ్చింది. విడుదలకు ముందే చిత్రంపై క్రేజ్ పెరిగింది.  దాంతో అడ్వాన్స్ బుకింగ్‌ భారీగా నమోదైంది. 

శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే 20 కోట్ల వసూళ్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.  ఇందులో  తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ కోటిపైనే ఉండటం గమనార్హం.  ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాల అంచనా ప్రకారం తొలి రోజు ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి రూ. 36 కోట్ల వసూళ్లు రాబట్టింది. సెలవు కాని రోజున విడుదలైన హిందీ ఒరిజినల్ చిత్రానికి వచ్చిన మొదటి రోజు కలెక్షన్స్ లో ఇదే అత్యధికం కావడం విశేషం. దాంతో, విడుదలతోనే ‘బ్రహ్మాస్త్ర’ కొత్త రికార్డును సృష్టించింది. 

అమెరికాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తొలి రోజు యూఎస్ ఏ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఒక మిలియన్ డాలర్లు (రూ. ఏడు కోట్లపైనే) సంపాదించినట్టు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో రణ్ బీర్, ఆలియాతో పాటు అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించగా.. షారూక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు. కాగా, ఈ చిత్రాన్ని రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దీనికి సీక్వెల్ కూడా ఉంది.


More Telugu News