ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశం... అధికారికంగా ప్రకటించిన కిమ్ జాంగ్ ఉన్

  • ఇప్పటికే అనేక అణ్వాయుధాలు అభివృద్ధి చేసిన ఉత్తర కొరియా
  • కొత్తగా అణుచట్టానికి రూపకల్పన
  • పార్లమెంటు ఆమోదించిందన్న కిమ్
  • ఇది అద్వితీయమైన చట్టమని వెల్లడి
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశం అని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, కొత్తగా అణు చట్టం కూడా తీసుకువచ్చారు. ఈ చట్టం ఇక ఎంతమాత్రం వెనక్కి తీసుకోలేనిదని స్పష్టం చేశారు. 

ఈ చట్టం ప్రకారం... దేశంలో అణ్వస్త్రాలను ఎప్పటికీ తొలగించరాదు. ఆత్మరక్షణ కోసం మొదటిగా దాడిచేసే హక్కు ఉత్తర కొరియాకు ఉందని ఆ చట్టంలో పేర్కొన్నారు. ఏ ఇతర దేశమైనా తమపై దాడి చేస్తేనే తాము స్పందిస్తామని, అణ్వస్త్ర రహిత దేశాలపై మొదట దాడిచేయబోమని గతంలో కిమ్ చెప్పారు. ఇప్పుడా సిద్ధాంతాన్ని తొలగించి, రక్షణ కోసం తామే మొదట దాడి చేసేలా చట్టంలో పేర్కొన్నారు. స్వీయరక్షణ కోసం ఉత్తర కొరియా ఏ దేశంపై అయినా దాడి చేయొచ్చని తెలిపారు. 

అణు నిరాయుధీకరణ దిశగా ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని కిమ్ తేల్చి చెప్పారు. ఈ అంశాన్ని కూడా చట్టంలో చేర్చారు. ఉత్తర కొరియా రక్షణ దిశగా ఈ చట్టం చిరస్మరణీయమైనదని అభివర్ణించారు. పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. 

ఈ భూమండలంపై అణ్వాయుధాలు ఉన్నంత కాలం, అమెరికా దాని మిత్రదేశాలు ఉత్తర కొరియా వ్యతిరేక చర్యలకు, సామ్రాజ్యవాద ధోరణులకు పాల్పడుతున్నంతకాలం... ఉత్తర కొరియా అణు ప్రస్థానం ఆగదని కిమ్ స్పష్టం చేశారు. తమ పయనం మరింత సుదృఢమవుతుందని ఉద్ఘాటించారు. కాగా, కొత్త చట్టం ప్రకారం ఉత్తర కొరియా అణు విజ్ఞానం ఇతర దేశాలకు బదిలీ చేయడం నిషిద్ధం. 

2017 తర్వాత ఉత్తర కొరియా అణు ప్రయోగాలు చేపట్టలేదు. తాజాగా కిమ్ దూకుడు చూస్తుంటే త్వరలోనే భారీ అణు పరీక్ష ఉంటుందని భావిస్తున్నారు.


More Telugu News