ఉత్త గాలి అమ్మి డబ్బు పోగేసుకుంటున్నాడు.. కొలంబియా యువకుడి సరికొత్త బిజినెస్‌!

  • మెడలిన్ ప్రాంతంలో అద్భుత వాతావరణాన్ని సొమ్ము చేసుకుంటున్న తీరు
  • ప్రత్యేక పరికరం రూపొందించి బాటిళ్లలో గాలి నింపుతున్నట్టు వెల్లడి
  • ఇదంతా మోసమంటూ విమర్శలు.. సరదాగా ఉందంటూ బాటిళ్లు కొంటున్న పర్యాటకులు
ఉన్నదీ లేనిది ఒకచోట చేర్చితే గాలి పోగేయడం అంటారు. అంటే అంతా ఉత్తదేనని అర్థం. మన చుట్టూ ఎక్కడపడితే అక్కడ, ఎంత కావాలంటే అంత గాలి ఉండటం వల్లే.. మనకు గాలి అంటే అంత చులకన. మరి అంత ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్న యువకుడు మీకు తెలుసా..? గాలి పోగేయడం కాదు.. గాలితో డబ్బులు పోగేయడం ఎలాగో తెలుసుకున్న ఔత్సాహిక బిజినెస్‌ మన్‌ గా పేరు పొందిన ఆ యువకుడు కొలంబియాలోని మెడెలిన్‌ కు చెందిన జూవాన్‌ కార్లోస్‌ అల్వరాడో.

పర్యాటకులను టార్గెట్ చేసుకుని..
  • కొలంబియాలోని మెడలిన్‌ ప్రాంతం అద్భుతమైన వాతావరణానికి పేరు. దీనిని సొమ్ము చేసుకోవడంపై కార్లోస్‌ దృష్టి పెట్టాడు. ‘ఇక్కడి నాణ్యమైన, సహజమైన గాలిని ఆస్వాదించండి’ అంటూ గాలి నింపిన బాటిళ్లను పర్యాటకులకు విక్రయించడం మొదలుపెట్టాడు. తన గాలి బాటిళ్లకు ‘మెడలిన్‌ ఎయిర్‌’ అని బ్రాండ్‌ నేమ్‌ కూడా పెట్టాడు.
  • బాటిళ్లలో గాలి ఏమిటన్న విమర్శలు వచ్చినా.. కార్లోస్‌ వెనక్కి తగ్గలేదు. అసలు బాటిళ్లలో గాలిని నింపడం ఎంతో కష్టమని, అందుకోసం తాను ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేశానని అంటున్నాడు.
  • ఒక్కో బాటిల్‌ లో గాలిని శుద్ధి చేసి నింపడానికి పావుగంట నుంచి అరగంట దాకా పడుతుందని ప్రచారం చేసుకుంటున్నాడు. మెడలిన్ ప్రాంతంలో తిరుగుతూ తన గాలి బాటిళ్లను అమ్ముతున్నాడు. 
  • ఒక్కో బాటిల్ ను ఐదు డాలర్లకు (సుమారు రూ.400) పర్యాటకులకు అమ్ముతున్నాడు. మొదట్లో రోజూ కొన్ని బాటిళ్లు అమ్ముడుపోయాయని.. ఇప్పుడు వందల్లో విక్రయిస్తున్నానని కార్లోస్ చెబుతున్నాడు.
  • ఇదేదో సరదాగా ఉందని కొందరు బాటిళ్లను కొంటుంటే.. మరికొందరు వింతగా చూస్తున్నారు. ఇక చాలా మంది కార్లోస్ ఖాళీ బాటిళ్లను అమ్ముతూ మోసం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు కూడా. అయినా అతడి దందా మాత్రం సాగుతూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


More Telugu News