ఆన్ లైన్ లో ఫేక్ రివ్యూల కట్టడి అంశంపై కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సెక్రటరీ వివరణ

  • త్వరలోనే కొత్త నిబంధనల జారీకి కేంద్రం కసరత్తు
  • వీటిపై ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థలతో సంప్రదింపులు
  • వెల్లడించిన కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి
ఏదైనా కొనే ముందు సగటు వినియోగదారులు ఏం చూస్తారు..? ఈ కామర్స్ సైట్లలో ఉత్పత్తి పేజీలో యూజర్ల రివ్యూలు చూస్తుంటారు. ఉత్పత్తిని అప్పటికే కొనుగోలు చేసిన వారు అది ఎలా ఉందన్నది తమ అభిప్రాయాలు, తాము పరిశీలించిన వివరాలతో రివ్యూ రాసి పోస్ట్ చేస్తుంటారు. అవి నిజమైన రివ్యూలు అయితే ఇతరులకు సాయంగా ఉంటుంది. కానీ, ఇవాళ ఈ కామర్స్ సైట్లలో నకిలీ రివ్యూలు, పెయిడ్ (డబ్బులు ఇచ్చి సానుకూలంగా రాయించుకోవడం) పెరిగిపోయాయి. ఈ కామర్స్ అనే కాదు, హోటల్ బుకింగ్ లు, ఇతర వేదికల్లోనూ ఫేక్ రివ్యూల బెడద పెరిగిపోయింది. 

అందుకే వీటికి చెక్ పెట్టేందుకు తగిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది. ఇప్పటికే ముసాయిదా నిబంధనలను సిద్ధం చేసింది.  ప్రస్తుతం నూతన నిబంధనలపై ఈ కామర్స్ సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్టు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. త్వరలోనే వీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. 

సమీక్ష, రేటింగ్ ల వాస్తవికతను గుర్తించడమే తమ ఉద్దేశ్యమని, రేటింగ్ ఇస్తున్న వారు అసలు ఆయా ఉత్పత్తి లేదా సేవకు వినియోగదారా? కాదా? అన్నది తెలుసుకోవడం ముఖ్యమన్నారు. నకిలీ లేదా నిర్ధారణ కాని రివ్యూల వల్ల.. అసలైన, పెయిడ్ రివ్యూల మధ్య అంతరాన్ని వినియోగదారులు గుర్తించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ కామర్స్ వేగంగా విస్తరిస్తూ, మరింత మంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నందున ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఇదే సరైన సమయంగా అభిప్రాయపడ్డారు.


More Telugu News