‘లైగర్’ హీరోయిన్ అనన్యతో యువ హీరో బ్రేకప్

  • కరణ్ జొహార్ వల్లే విడిపోయామన్న ఇషాన్ ఖట్టర్
  • కరణ్ చెప్పడం వల్లే అనన్య తనకు దూరమైందని వ్యాఖ్య
  • ఆమెతో జీవితాంతం స్నేహితుడిగా ఉంటానన్న యువ హీరో
బాలీవుడ్ యువ నటి, ఇటీవల విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్‘ సినిమాలో నటించిన అనన్య పాండే, యువ హీరో ఇషాన్ ఖట్టర్ బ్రేకప్ అయ్యారు. ప్రముఖ నిర్మాత, ‘కాఫీ విత్ కరణ్’ షో హోస్ట్ కరణ్ జొహార్ వల్లే తాము విడిపోయామని ఇషాన్ ఖట్టర్ తెలిపాడు.

అనన్య, ఇషాన్ చాన్నాళ్లు ప్రేమలో ఉన్నారు. కానీ, తమ సంబంధాన్ని వీరు బహిర్గతం చేయలేదు. అలాగే, విడిపోవడాన్ని కూడా ధ్రువీకరించలేదు. అయితే, ఇటీవల కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరైన ఇషాన్ ఈ విషయం వెల్లడించాడు. అనన్యతో విడిపోవడం గురించి ఇషాన్‌ను కరణ్ అడిగారు.

ఈ షోలో సిద్ధాంత్ చతుర్వేది మాట్లాడుతూ తాను ఒంటరిగా ఉన్నానని, తనతో తిరుగుతూ ఇషాన్ కూడా సింగిల్ అయ్యాడని వ్యాఖ్యానించాడు. దాంతో, కరణ్.. ఇషాన్ రిలేషన్ షిప్ స్టేటస్‌ గురించి అడిగాడు. ‘నువ్వు ఈ మధ్యే అనన్యతో విడిపోయావు కదా?’ అని ప్రశ్నించాడు.

దీనిపై ఇషాన్ ఖట్టర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు  ‘నేను విడిపోలేదు. మీరు చెప్పడం వల్లనే ఆమెనే ఇటీవల నాతో విడిపోయింది’ అని పేర్కొన్నాడు. గత ఎడిసోడ్ కు వచ్చిన అనన్యను కూడా కరణ్ ఇదే ప్రశ్నను అడిగాడు. ఇషాన్‌తో డేటింగ్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్లారా? అని మునుపటి ఎపిసోడ్‌లో అనన్యను అడిగానని కరణ్ పేర్కొన్నాడు. ఆమె అలాంటిదేమీ లేదని ఖండించిందని చెప్పారు. 

దీనిపై స్పందించడానికి ఇషాన్ నిరాకరించాడు. ఎవరు ఎవరితో విడిపోయినా పర్వాలేదని, తాను చాలా ఒంటరిగా ఉన్నానని ఇషాన్ చివరకు ధ్రువీకరించాడు. ఇప్పుడు అనన్య పాండేతో స్నేహంగా ఉన్నారా? అని అడిగినప్పుడు ‘నా జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తులలో ఆమె ఒకరు. ఆమె నాకు చాలా ప్రియమైన వ్యక్తి‘ అని చెప్పాడు.


More Telugu News