భారీ విజయంతో ఆసియా కప్ ప్రస్థానం ముగించిన టీమిండియా

  • ఆఫ్ఘన్ పై 101 పరుగుల తేడాతో ఘనవిజయం
  • 5 వికెట్లతో భువనేశ్వర్ సూపర్ స్పెల్
  • లక్ష్యఛేదనలో ఆఫ్ఘన్ 111/8  
  • అంతకుముందు 2 వికెట్లకు 212 పరుగులు చేసిన భారత్
  • కోహ్లీ అద్భుత సెంచరీ
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో భారత్ తన ప్రస్థానాన్ని భారీ విజయంతో ముగించింది. టోర్నీ సూపర్-4 దశలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భువనేశ్వర్ కుమార్ 5 వికెట్ల సంచలన బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన వేళ, ఆఫ్ఘనిస్థాన్ ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ విధ్వంసక సెంచరీ సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం, 213 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘన్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చిందంటే అది ఇబ్రహీం జాద్రాన్ వల్లే. జాద్రాన్ 59 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముజీబ్ 18, రషీద్ ఖాన్ 15 పరుగులు చేశారు. 

టీమిండియా బౌలింగ్ లో హైలైట్ అంటే భువీ నిప్పులు చెరిగే స్పెల్ అని చెప్పాలి. ఈ రైట్ హ్యాండ్ పేస్ బౌలర్ 4 ఓవర్లు విసిరి కేవలం 4 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. భువీ స్పెల్ లో ఓ మెయిడెన్ కూడా ఉంది. ఇక, అర్షదీప్ 1, దీపక్ హుడా 1, అశ్విన్ 1 వికెట్ తీశారు.


More Telugu News