గణేశ్​ శోభాయాత్ర.. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు హైదరాబాద్​ లో ట్రాఫిక్​ ఆంక్షలు

  • వివరాలు వెల్లడించిన హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్
  • వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి
  • వాహనాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసినట్టు వెల్లడి
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్టు పోలీసులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం నుంచి వినాయక నిమజ్జనం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శోభాయాత్ర సజావుగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. ఆ లోగా గణేశ్ నిమజ్జనం ముగుస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. 

20 వేలకుపైగా గణేశ్ విగ్రహాలు
నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుస్సేన్‌ సాగర్‌ లో శుక్రవారం రోజున దాదాపు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. 3 వేల మందికిపైగా ట్రాఫిక్ సిబ్బందిని మోహరించామని.. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామని వివరించారు.

ట్యాంక్ బండ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీదుగా ప్రయాణించే సాధారణ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే సూచించామని వెల్లడించారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ముగుస్తుందని పేర్కొన్నారు.


More Telugu News