ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునేది నిందితులను రక్షించడానికా?: ఏపీ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం

  • చెన్నుపాటి గాంధీపై దాడి నిందితులకు స్టేషన్ బెయిల్
  • తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
  • పోలీసులు ఎవరి పక్షమో తేలిపోయిందని వెల్లడి
  • ఏపీ పోలీస్ బ్రాండ్ సర్వనాశనం అయిందని వ్యాఖ్యలు
టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన నిందితుల రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించగా, పోలీసులు వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. కన్ను పొడిచినా స్టేషన్ బెయిల్, నినాదాలు చేసినందుకే హత్యాయత్నం కేసు... ఇలాంటి పోకడలతో రాష్ట్రంలో పోలీసు అధికారులు తామేంటో, తమ శాఖ తీరేంటో, తాము ఎటువైపో స్పష్టంగా చెప్పారని విమర్శించారు.

కుప్పంలో సాధారణ నిరసనలు చేపట్టిన వారిపై హత్యాయత్నం సెక్షన్ నమోదు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు.... విజయవాడలో దాడి చేసి కన్ను పోగొట్టిన నిందితులకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారని ఆరోపించారు. ఈ రెండు ఘటనల్లో ఖాకీలు వ్యవహరించిన తీరు పోలీసు శాఖ ప్రతిష్ఠకే మాయనిమచ్చ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాపకం కోసం పోలీసులు మరీ ఇంతలా సాగిలపడడాన్ని ప్రజలు ఎవరూ ఆమోదించరని పేర్కొన్నారు. 

ఏపీ పోలీస్ అనే బ్రాండ్ సర్వనాశనం కావడానికి, ప్రజలకు పోలీసులపై నమ్మకం పోవడానికి ఈ ఘటన చాలు అని వివరించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునేది నిందితులను రక్షించేందుకు కాదని, చట్టప్రకారం పనిచేయండి అంటూ చంద్రబాబు హితవు పలికారు.


More Telugu News