ఈ పక్షులు నీటిపై నడుస్తాయ్.. పరుగెత్తుతాయ్ కూడా.. వీడియో ఇదిగో!

  • అమెరికాలో నివసించే వెస్టర్న్ గ్రేబ్స్, క్లార్క్ గ్రేబ్స్ పక్షులు
  • నీటిలో ఈదుతుండగా పైకి లేచి కొంత దూరం పరుగెత్తే సామర్థ్యం
  • పెద్ద పరిమాణంలోని పాదాలు, వేగంగా ఆడించడం వల్ల ఇలా వెళ్లే సామర్థ్యం వచ్చిందంటున్న నిపుణులు
జీవి ఏదైనా సరే నీటిలోకి వెళితే బుడుంగున మునిగిపోవాల్సిందే. అతిచిన్న జంతువులు అయిన కొన్నిరకాల సాలీడులు, పురుగులు వంటివి మాత్రమే నీటిపై నడిచే సామర్థ్యం కలిగి ఉంటాయి. కొన్ని రకాల బల్లులకు నీటిపై కొంతదూరం వేగంగా పరుగెత్తగలిగే సామర్థ్యం ఉంటుంది. అయితే ఇవీ చిన్నస్థాయి జీవులే కావడం గమనార్హం. అయితే కాస్త బరువైన, పెద్ద సైజులో ఉండే వెస్టర్న్ గ్రేబ్స్, క్లార్క్ గ్రేబ్స్ పక్షులకు కూడా నీటి ఉపరితలంపై పరుగెత్తే సామర్థ్యం ఉండటం గమనార్హం.

అరుదైన సామర్థ్యంతో..
  • వెస్టర్న్ గ్రేబ్స్ పక్షులు నీటిలో ఈదుతున్న సమయంలో ఉన్నట్టుండి పైకి లేచి.. నీటిపై కొంత దూరం పరుగెత్తుతాయి. తిరిగి మళ్లీ నీటిలోకి దిగి ఈదుతూ ఉంటాయి.
  • ఈ పక్షులు ఒకసారి ఇలా సుమారు ఏడెనిమిది సెకన్ల పాటు నీటిపై పరుగెడతాయి. ఆ సమయంలో సుమారు 20 మీటర్లకుపైగా దూరం వెళతాయి. కావాలంటే మళ్లీ మరోసారి నీటిపై పరుగెడతాయి.
  • ఎక్కువగా జత కూడే సమయంలో తోటి పక్షులను ఆకట్టుకోవడానికి వెస్టర్న్ గ్రేబ్స్ పక్షులు ఇలాంటి ఫీట్లు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • ఈ పక్షులు సుమారు 800 గ్రాముల నుంచి రెండున్నర కిలోలదాకా బరువు ఉంటాయి. ప్రపంచంలో నీటిపై పరుగెత్తగలిగే బరువైన జీవులు వెస్టర్న్, క్లార్క్ గ్రేబ్స్ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
  • 2015లో అమెరికా శాస్త్రవేత్తల బృందం ఈ పక్షులపై పరిశోధన చేసింది. నీటిపై అవి ఎలా పరుగెత్తగలుగుతున్నాయోనని పరిశీలించింది.
  • కాస్త పెద్ద పరిమాణంలో ఉండే పాదాలు, వాటిని అత్యంత వేగంగా సెకనుకు 20 సార్లు నీటిపై గట్టిగా చరుస్తూ, పైకి లేపడం ద్వారా.. ఈ పక్షులు నీటిపై పరుగెత్తగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
  • అయితే అవి నీటిలో ఈదుతూ ఉండగా.. ఒక్కసారిగా ఉపరితలంపైకి ఎలా రాగలుగుతున్నాయి? అలా పైకి లేచి ఎలా పరుగెత్తగలుగుతున్నాయి అన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News