కిచెన్ రిపేర్ చేయిస్తుంటే.. బంగారు నాణాలు బయటపడ్డాయి!
- చిన్నపాటి డబ్బాలో 260 బంగారు నాణాలను గుర్తించిన కుటుంబం
- ఇంగ్లండ్ నార్త్ యార్క్ ఫైర్ లోని ఎల్లెర్ బీ గ్రామంలో ఘటన
- ఈ నెల రెండో వారంలో వేలం వేయనున్న స్పింక్ సంస్థ
గుప్త నిధులు.. తవ్వకాలు.. అంటూ తరచూ వార్తలు వస్తుంటాయి. తమకూ అలా బంగారం దొరికితే బాగుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు కూడా. కానీ ఓ ఫ్యామిలీకి మాత్రం అలా అనుకోకుండానే అలా నిధి లాంటి బంగారం దొరికింది. పాత ఇంట్లో వంట గది పాడైపోయిందని రినోవేషన్ చేయిస్తుంటే.. కలపతో చేసిన ఫ్లోరింగ్ కింద ఓ చిన్నపాటి రేకు డబ్బా బయటపడింది. అదేమిటని తీసి చూస్తే.. మిలమిలా మెరిసే బంగారు నాణాలు బయటపడ్డాయి. యునైటెడ్ కింగ్ డమ్ లోని నార్త్ యార్క్ షైర్ పరిధిలోని ఎల్లెర్ బీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మూడు వందల ఏళ్ల కిందటివి
మూడు వందల ఏళ్ల కిందటివి
- చెక్క ఫ్లోరింగ్ కింద దొరికిన డబ్బాలో మొత్తం 260 నాణాలను గుర్తించారు. వాటిని పరిశీలించగా.. 1720వ సంవత్సరంలో బ్రిటన్ పాలకులు జారీ చేసిన 50 పౌండ్లు, 100 పౌండ్ల బంగారు నాణాలుగా గుర్తించారు.
- అందులో నాడు చలామణీలో ఉన్న బ్రెజిల్ బంగారు నాణెం కూడా ఉంది. మొత్తంగా ఈ నాణాలను లండన్ కు చెందిన స్పింక్ సంస్థ వేలం వేయనుంది.
- వేలం కోసం ఒక్కో బంగారు నాణానికి కనీస మొత్తంగా రూ.40వేల నుంచి రూ.లక్ష రూపాయల దాకా ధర నిర్ణయించారు. మొత్తం 260 నాణాలను వేలం వేయనున్నారు.
- అన్ని నాణాలకు కలిపి కనీస మొత్తంగా మూడు లక్షల డాలర్లు (సుమారు రెండున్నర కోట్లు) ధర నిర్ణయించారు. పాత నాణాలు కాబట్టి.. వేలంలో పాల్గొనే వారిని బట్టి వీటికి ధర పెరిగే అవకాశం ఉంటుందని వేలం సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.