‘సీట్ బెల్ట్’ల విషయంలో అమెజాన్ కు కేంద్రం కీలక ఆదేశం

  • సీట్ బెల్ట్ అలారమ్ స్టాపర్లను విక్రయించొద్దని ఆదేశం
  • అమెజాన్ కు కేంద్ర రవాణా శాఖ నోటీసులు
  • త్వరలో అన్ని కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగులు
ప్రముఖ పారిశ్రామికవేత్త, షాపూర్జీ పల్లోంజీ గ్రూపు వారసుడైన సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సీటు బెల్ట్ విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. సీట్ బెల్ట్ ధరించకపోతే హెచ్చరించే అలారమ్ వ్యవస్థను జామ్ చేసే పరికరాలను విక్రయించొద్దంటూ అమెజాన్ ను కేంద్ర సర్కారు ఆదేశించింది. అమెజాన్ తన ప్లాట్ ఫామ్ పై మెటల్ క్లిప్పులను విక్రయిస్తోంది. వీటిని సీట్ బెల్ట్ కు పెట్టడం వల్ల అలారమ్ మోగకుండా ఉంటుంది. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అలారమ్ మోగుతూ ఉంటుంది. ఈ సౌండ్ నచ్చని వారు ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసి వాడుతున్నారు. 

దీంతో కేంద్ర రవాణా శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. వీటి విక్రయాలను నిలుపుదల చేయాలని కోరుతూ అమెజాన్ కు నోటీసులు పంపినట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ఇక కార్లలో వెనుక కూర్చున్నవారు కూడా సీటు బెల్ట్ ధరించాల్సిందేనని, లేదంటే జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. కార్లలో ఆరింటికి బదులు కేవలం నాలుగు ఎయిర్ బ్యాగులే ఉండడం ఏంటని? నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. ఒక్కో ఎయిర్ బ్యాగ్ వల్ల కార్ల సంస్థలకు రూ.900 మించి ఖర్చు కాదన్నారు. ఈ విషయంలో బాగా నిర్లక్ష్యం ఉన్నట్టు చెప్పారు. అందుకే అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయనున్నట్టు తెలిపారు.


More Telugu News