మోసగాళ్ల బారినపడి ఒమన్‌లో చిక్కుకుపోయిన యువతి.. క్షేమంగా ఇంటికి చేర్చిన క్రికెటర్ హర్భజన్ సింగ్

  • ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన యువతి
  • అక్కడ పాస్‌పోస్ట్, సిమ్‌కార్డ్ లాగేసుకున్న ఏజెంట్
  • బురఖా తొడిగించి అరబిక్ భాష నేర్చుకోమని బలవంతం
  • విషయం తెలిసి ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందితో మాట్లాడిన హర్భజన్
  • వారి చొరవతో ఈ నెల 3న స్వదేశం చేరుకున్న యువతి
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మంచి మనసు చాటుకున్నాడు. మోసగాళ్ల బారినపడి గల్ఫ్‌లో చిక్కుకుపోయిన నిరుపేద యువతిని క్షేమంగా ఇంటికి చేర్చాడు. పంజాబ్‌లోని బఠిండా జిల్లా బార్‌కండి గ్రామానికి చెందిన సికందర్‌సింగ్ దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు కాగా, పెద్దమ్మాయి కమల్జీత్ కౌర్ (21) తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది. కుటుంబానికి ఆసరాగా నిలవాలన్న ఉద్దేశంతో స్థానిక ఏజెంటును ఆశ్రయించింది. అక్కడ ఓ భారతీయ కుటుంబంలో పనికి కుదుర్చుతామని చెప్పి ఆమెను గత నెలాఖరులో ఒమన్ రాజధాని మస్కట్ పంపించాడు. 

అక్కడి విమానాశ్రయంలో ఓ ఏజెంట్ ఆమెను కలిసి నేరుగా ఫలజ్ అల్ ఖబైల్ అనే ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడకు చేరగానే కమల్జీత్ పాస్‌పోర్టు, సిమ్‌కార్డు లాక్కున్నారు. అక్కడ మరో 20 మంది వరకు భారతీయ మహిళలు ఉన్నట్టు కమల్జీత్ తెలిపింది. అక్కడ ఆమె నుంచి పాస్‌పోర్ట్, సిమ్‌కార్డ్ లాక్కున్న వారు కమల్జీత్‌తో బలవంతంగా బురఖా తొడిగించారు. ఆపై అరబిక్ భాష నేర్చుకోవాలని ఆదేశించారు. దీంతో తాను మోసపోయినట్టు గుర్తించిన కమల్జీత్ ఎలాగోలా కొత్త సిమ్‌కార్డ్ సంపాదించి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఈ విషయం తెలిసిన అక్కడున్న వారు ఆమెను కర్రతో చితకబాదారు. 

మరోవైపు, గల్ఫ్‌లో చిక్కుల్లో పడిన కుమార్తెను వెనక్కి రప్పించుకునేందుకు తండ్రి సికందర్ ఇంటిని తాకట్టుపెట్టి స్థానిక ఏజెంట్‌కు రూ. 2.5 లక్షలు ఇచ్చాడు. విషయం తెలిసిన రాజ్యసభ సభ్యుడు, మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ ఒమన్‌లోని భారత దౌత్య కార్యాలయ సిబ్బందితో మాట్లాడి కమల్జీత్ కౌర్‌ను రక్షించాల్సిందిగా కోరారు. వారు వెంటనే స్పందించి కమల్జీత్‌ను రక్షించారు. ఈ నెల 3న ఆమె మస్కట్ నుంచి ఇండియా చేరుకుంది. అక్కడ తనలానే ఎంతోమంది భారతీయ యువతులు చిక్కుకుపోయారని, వారందరినీ రక్షించాలని కమల్జీత్ ప్రభుత్వాన్ని కోరింది.


More Telugu News