మాది థ‌ర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంటే: నితీశ్ కుమార్‌

  • ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో నితీశ్ కుమార్‌
  • ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో భేటీ
  • సోనియాతో భేటీ కోసం మ‌రోమారు వ‌స్తాన‌ని వెల్ల‌డి
బీజేపీయేత‌ర పార్టీల‌ను ఏక‌తాటిపైకి తెచ్చే దిశ‌గా స్పీడు పెంచిన జేడీయూ అధినేత‌, బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌... విప‌క్షాల కూట‌మి పేరుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న పార్టీల‌న్నీ క‌లిసి ఏర్పాటు చేసే కూట‌మిని థ‌ర్డ్ ఫ్రంట్ అని అంతా అంటుండ‌గా... నితీశ్ మాత్రం దానిని మెయిన్ ఫ్రంట్‌గా చెప్పారు. త‌మ‌ది థ‌ర్డ్ ఫ్రంట్ కాద‌ని, మెయిన్ ఫ్రంటేన‌ని నితీశ్ చెప్పారు.

ప‌లు పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌ల‌తో భేటీ కోసం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన నితీశ్ కుమార్ బుధ‌వారం ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీజేపీయేత‌ర పార్టీల కూట‌మిని మెయిన్ ఫ్రంట్‌గానే తాను ప‌రిగ‌ణిస్తున్నాన‌ని చెప్పారు. విప‌క్షాల‌న్నింటినీ ఏక‌తాటిపైకి తీసుకురావ‌డ‌మే తొలి ప్రాధాన్యంగా చెప్పిన నితీశ్‌... కూట‌మికి ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హిస్తార‌న్న దానిపై తర్వాత ఆలోచ‌న చేస్తామ‌న్నారు. బుధ‌వారంతో త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింద‌ని, అనారోగ్య కార‌ణాల‌తో విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కోసం మ‌రోమారు ఢిల్లీకి వస్తానని ఆయన తెలిపారు.


More Telugu News