సీపీఎస్‌పై ఉద్యోగుల‌తో ఏపీ ప్ర‌భుత్వ చ‌ర్చ‌లు మ‌రోమారు విఫ‌లం

  • మంత్రుల క‌మిటీతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఉద్యోగ సంఘాలు
  • సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమ‌లు చేస్తామ‌న్న క‌మిటీ
  • జీపీఎస్‌కు మ‌రికొన్ని ప్ర‌యోజ‌నాలు క‌లిపామ‌ని వెల్ల‌డి
  • ఓపీఎస్ మిన‌హా ఏ ప్ర‌త్యామ్నాయాన్ని అంగీక‌రించేది లేద‌న్న ఉద్యోగులు
  • మ‌రోమారు ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చిస్తామ‌న్న మంత్రి బొత్స‌
కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్‌)పై ఉద్యోగుల‌తో ఏపీ ప్ర‌భుత్వం బుధ‌వారం జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. సీపీఎస్ ర‌ద్దు కోసం ఉద్యోగులు చేస్తున్న ఆందోళ‌న‌లు విర‌మించేలా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి... మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిల‌తో నియ‌మించిన క‌మిటీ బుధ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. 

ఈ చ‌ర్చ‌ల్లో సీపీఎస్ ర‌ద్దుకు ఓకే చెప్పిన మంత్రుల క‌మిటీ... దాని స్థానంలో జ‌న‌ర‌ల్ పెన్ష‌న్ స్కీం(జీపీఎస్‌) అమ‌లు చేస్తామ‌ని చెప్పింది. అయితే ఓల్డ్ పెన్ష‌న్ స్కీం (ఓపీఎస్‌) అమ‌లు చేయ‌డం మిన‌హా తాము ఎలాంటి ఇత‌ర ప్ర‌త్యామ్నాయ పద్ధతికి అనుకూలంగా లేమ‌ని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. 

అయితే గ‌తంలో ప్ర‌తిపాదించిన జీపీఎస్‌కు మ‌రికొన్ని మార్పులు చేసిన‌ట్లు తెలిపిన మంత్రుల క‌మిటీ... వాటి వివ‌రాల‌ను ఉద్యోగుల‌కు వివ‌రించింది. ఈ వివరాల‌న్నీ విన్న తర్వాత ఉద్యోగ సంఘాల నేత‌లు ఈ ప్ర‌తిపాద‌న త‌మ‌కు అనుకూలం కాదంటూ తేల్చి చెప్పారు. దీంతో గ‌తంలో జ‌రిగిన చర్చ‌ల మాదిరే బుధ‌వారం నాటి చ‌ర్చ‌లు కూడా విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఉద్యోగ సంఘాలు ప్ర‌క‌టించాయి. 

చ‌ర్చ‌లు ముగిసిన త‌ర్వాత మీడియాతో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మాట్లాడుతూ... సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌న్న త‌మ మాట‌ను అమ‌లు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌కటించారు. అయినా కూడా ఉద్యోగులు తాము కోరుతున్న ఓపీఎస్‌కే ప‌ట్టుబ‌ట్ట‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక ప‌రిస్థితిని కూడా ఉద్యోగులు అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. మ‌రోమారు ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు బొత్స ప్ర‌క‌టించారు.


More Telugu News