అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు క్రీడాకారులను ఘనంగా సన్మానించిన ఏపీ గవర్నర్

  • ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడలు
  • పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు
  • అద్భుతంగా రాణించిన పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్
  • ఆర్చరీ ప్రపంచ కప్, వరల్డ్ గేమ్స్ లో సత్తా చాటిన జ్యోతిసురేఖ
ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లోనూ, ఆర్చరీ వరల్డ్ కప్ లోనూ, వరల్డ్ గేమ్స్-2022 లోనూ మెరుగైన ప్రతిభ కనబర్చిన తెలుగు క్రీడాకారులను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ లో ఘనంగా సన్మానించారు. ఇక్కడి దర్బార్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేశారు. 

కామన్వెల్త్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సింగిల్స్ లో స్వర్ణం సాధించిన పీవీ సింధును, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించిన కిదాంబి శ్రీకాంత్ ను, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టితో కలిసి స్వర్ణం అందుకున్న రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ను సన్మానించారు. 

అంతేకాకుండా, ఆర్చరీ వరల్డ్ కప్-2022 వ్యక్తిగత ఈవెంట్ లో రజతం, టీమ్ ఈవెంట్ లో స్వర్ణం, ఆర్చరీ వరల్డ్ గేమ్స్-2022లో మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్యం సాధించిన వెన్నం జ్యోతిసురేఖను కూడా సత్కరించారు.

ప్రపంచస్థాయిలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక క్రీడల్లో పతకాలు గెలిచి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని గవర్నర్ హరిచందన్ తెలుగు క్రీడాకారులను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భారత జాతి వారు సాధించిన విజయాల పట్ల గర్విస్తోందని అన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని పతకాలు గెలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
.


More Telugu News