చిన్నప్పటి నుంచి డాక్టర్​ అయ్యేదాకా.. చేతిరాతపై ఆనంద్​ మహీంద్రా షేర్​ చేసిన వైరల్​ వీడియో ఇదిగో

  • పదో తరగతిలో చేతిరాత ఎలా ఉంటుందనే దానితో మొదలు
  • డాక్టర్, ఆ పైస్థాయి చదువుకు వెళ్లే సరికి ఎలా మారుతుందనే దానిపై వీడియో
  • ఇది నిజమేనంటూ చాలా మంది కామెంట్లు
మనం ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వైద్యులు రాసే మందుల చీటీ (ప్రిస్క్రిప్షన్) ఏదో గీతలు గీసినట్టుగా ఉండటం అందరికీ తెలిసిందే. దీనిపై ఎన్నో సరదా కామెంట్లు, జోకులు కూడా ప్రచారంలో ఉన్నాయి. నిజానికి మామూలుగా స్కూల్ లో చదువుకునేటప్పుడు చేతి రాత గుండ్రంగా, అందంగా ఉండాలని చాలా మంది కష్టపడుతుంటారు. కొందరు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తుంటారు కూడా. అయితే ఇంటర్మీడియట్, ఆపైస్థాయి చదువుకు వెళ్లే కొద్దీ రాతలో మార్పు వచ్చేస్తుంటుంది. దీనికి సంబంధించి సరదాగా తీసిన ఓ వీడియోను ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

డాక్టర్ల చేతిరాత ఇలా ఉంటుందంటూ..
  • డాక్టర్ల చేతిరాత ఇలా ఉంటుందంటూ రూపొందించిన ఈ వీడియోలో.. పదో తరగతి, తర్వాత ఇంటర్మీడియట్ స్థాయి, ఎంబీబీఎస్, పీజీ చదివే వరకు చేతిరాతను చూపించారు. మొదట చాలా నీట్ గా ఉన్న చేతిరాత కొద్దికొద్దిగా మారిపోతూ వచ్చింది.
  •  ఆ తర్వాత జూనియర్ డాక్టర్, సీనియర్ డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్ దాకా చేతిరాతను చూస్తే.. నవ్వు ఆపుకోలేం. ఆనంద్ మహీంద్రా కూడా.. ‘ఇదెంతో సరదాగా ఉంది. కానీ నిజమే..’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టడం గమనార్హం.
  • ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ వీడియో ఎంత వైరల్ గా మారిందంటే.. రెండు రోజుల్లోనే 19 లక్షల మందికిపైగా దీనిని వీక్షించారు. 57 వేలకుపైగా లైకులు, 8 వేల వరకు రీట్వీట్లు రావడం గమనార్హం.
  • ‘ఇది నిజమే మరి. ఎందుకో ఇలా’ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. కేవలం మందుల దుకాణం వాళ్లకే అర్థమయ్యేందుకే అలా రాస్తుంటారని మరికొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా ఇదైతే సరదాగా అనిపించే వాస్తవం అంటూ కామెంట్లు పెడుతున్నారు.



More Telugu News