యువ పేసర్ అర్షదీప్​ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ

  • పాకిస్థాన్ తో మ్యాచ్ లో క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత గొప్పగా పుంజుకున్నాడని ప్రశంస
  • ఆ మ్యాచ్ చివరి ఓవర్ తో పాటు శ్రీలంకపై రెండు ఓవర్లు బాగా బౌలింగ్ చేశాడన్న రోహిత్
  • కెరీర్ ఆరంభంలో ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్న బౌలర్ ను చూడలేదని వ్యాఖ్య 
ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో క్యాచ్ డ్రాప్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత యువ పేసర్ అర్షదీప్ సింగ్ పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఆ మ్యాచ్ లో నిరాశ తర్వాత తను గొప్పగా పుంజుకున్నాడని, యువ క్రీడాకారుడిది బలమైన మనస్తత్వమని అన్నాడు. సూపర్-4లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో పాకిస్థాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ ను 23 ఏళ్ల అర్షదీప్ జారవిడిచాడు. దీనివల్లే భారత్ ఓడిందంటూ అతనిపై ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. 

ఇక, శ్రీలంకతో మంగళవారం రాత్రి ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో  ఏడు పరుగులను కాపాడేందుకు అర్షదీప్ చాలా ప్రయత్నించాడు. అయినా భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్.. యువ బౌలర్ గురించి మాట్లాడాడు.

‘పాకిస్థాన్ మ్యాచ్ లో క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత అర్షదీప్ కూడా చాలా నిరాశ చెందాడు. అయినప్పటికీ గుండె నిబ్బరం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాడు. మంచి యార్కర్లు వేసి ఆసిఫ్ అలీని చివరకు తానే ఔట్ చేశాడు. అతను మానసికంగా బలంగా లేకపోతే అలా బౌలింగ్ చేయలేడు. ఈ రోజు (శ్రీలంకపై) కూడా చివరి రెండు ఓవర్లలో అతను బాగా బౌలింగ్ చేశాడు’ అని రోహిత్ చెప్పాడు.  

అర్షదీప్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆటగాడని, అతను ఆటను అర్థం చేసుకునే విషయం పట్ల టీమ్ మేనేజ్‌మెంట్ సంతృప్తిగా ఉందన్నాడు. ‘అతను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న కుర్రాడు. అందుకే తమ ఇళ్లలో కూర్చున్న చాలా మంది ఆటగాళ్ల కంటే అతను ముందున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే ఇంత ఆత్మ స్థయిర్యం చూపే ఆటగాళ్లను నేను ఇది వరకు చూడలేదు. అర్షదీప్ ఆటను స్వీకరించే విధానం, అతని బౌలింగ్ పట్ల ఒక కెప్టెన్ గా నేను సంతృప్తిగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు.


More Telugu News