మరో బాహుబలి లాంటి చిత్రం కోసం ఒకే వేదికపైకి రజనీకాంత్, కమలహాసన్

  • నిన్న రాత్రి 'పొన్నియిన్ సెల్వన్ 1' (పీఎస్1) ట్రైలర్ విడుదల చేసిన దిగ్గజ నటులు
  • మణిరత్నం దర్శకత్వంలో భారీ అంచనాలతో వస్తున్న సినిమా
  • ప్రధాన పాత్రల్లో నటించిన ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష
  • ఈ నెల 30న తమిళ్, తెలుగు సహా ఐదు భాషల్లో విడుదల
దక్షిణాది దిగ్గజ నటులు రజనీకాంత్, కమలహాసన్ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి మణిరత్నం రూపొందించిన మల్టీస్టారర్ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్ 1' (పీఎస్1) ట్రైలర్ విడుదల చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానుల మధ్య మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన ఈ కార్యక్రమంలో రజనీ, కమల్ పాటు ఐశ్వర్యరాయ్, విక్రమ్, కార్తీ, త్రిష తదితరులు సందడి చేశారు. మణిరత్నం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘పీఎస్1’ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ నెల 30వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. 

తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రంలో ఐశ్వర్యరాయ్ తో పాటు విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి, ధూళిపాల శోభిత, విక్రమ్ ప్రభు తదితర స్టార్లు నటిస్తున్నారు. ప్రముఖ రచయిత కల్కి పురాణ నవల ఆధారంగా రూపొందిన ఈ పీరియాడికల్ చిత్రం ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. భారత్ ను పరిపాలించిన చోళుల కథను వివరించే అద్భుతమైన చిత్రంగా ఇది కనిపిస్తోంది.

 మూడు నిమిషాల 30 సెకన్ల నిడివి గల తమిళ ట్రైలర్.. చిత్రం గురించి కమలహాసన్ చెప్పే కథనం నేపథ్యంతో మొదలవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్రాన్ని అందరూ ‘బాహుబలి’తో పోలుస్తున్నారు. కొన్నాళ్లుగా సరైన విజయాలు లేని మణిరత్నం ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెల 30వ తేదీ వరకూ వేచి చూడాలి.


More Telugu News