విద్వేష రాజకీయాలకు తండ్రిని కోల్పోయాను.. ఇప్పుడు దేశాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా లేను: రాహుల్ గాంధీ

  • ఈరోజు ప్రారంభం కానున్న రాహుల్ 'భారత్ జోడో యాత్ర'
  • కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగనున్న యాత్ర
  • శ్రీపెరంబుదూరులోని తన తండ్రి స్మారకం వద్ద నివాళి అర్పించిన రాహుల్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈరోజు 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ వరకు కొనసాగనుంది. యాత్ర ప్రారంభానికి ముందు తన తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి రాహుల్ నివాళి అర్పించారు. ఈ ఉదయం తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న రాజీవ్ స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. తొలుత అక్కడ ఒక మొక్కను నాటారు. అనంతరం తన తండ్రి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట కాంగ్రెస్ ప్రముఖులు డీకే శివకుమార్, కేఎస్ అళగిరి తదితరులు ఉన్నారు. 

అనంతరం ఆయన ట్విట్టర్ ద్వారా భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. 'విద్వేష రాజకీయాలు, విభజన రాజకీయాలు నా తండ్రిని కోల్పోయాను. నేనెంతో ప్రేమించే నా దేశాన్ని కోల్పోలేను. విద్వేషాన్ని ప్రేమ జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. మనందరం ఐకమత్యంగా సవాళ్లను అధిగమమిద్దాం' అని రాహుల్ ట్వీట్ చేశారు.


More Telugu News