వైజాగ్‌లో మంటల్లో దగ్ధమైన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పించుకున్న 50 మంది ప్రయాణికులు

  • వాడచీపురుపల్లి నుంచి ప్రయాణికులతో బయలుదేరిన బస్సు
  • జ్ఞానాపురం వంతెనపైకి రాగానే వెనక చక్రం నుంచి పొగలు
  • కండక్టర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
విశాఖపట్టణంలో ఓ ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న 50 మంది త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పరవాడ మండలం వాడచీపురుపల్లి నుంచి 50 మంది ప్రయాణికులతో ఓ బస్సు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బయలుదేరింది. జ్ఞానాపురం కాన్వెంట్ కూడలి వంతెనపైకి రాగానే బస్సు వెనక చక్రం నుంచి పొగలు వచ్చాయి. గమనించిన కండక్టర్ ఆ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పి అప్రమత్తం చేశాడు. ప్రమాదాన్ని శంకించిన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దింపి పోలీసులకు సమాచారం అందించాడు.

ప్రయాణికులు కిందికి దిగిన క్షణాల్లో  మంటలు వ్యాపించి బస్సును చుట్టుముట్టాయి. అదే సమయంలో అటుగా గ్యాస్ సిలిండర్ల లారీ రావడంతో అక్కడే ఉన్న హోంగార్డు దానిని దూరంగా నిలిపివేశాడు. ఆ తర్వాత క్షణాల్లోనే బస్సు అగ్నికీలల్లో చిక్కుకుని కాలి బూడిదైంది. మరోవైపు, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News