మళ్లీ మొదటికే వచ్చిన కోహ్లీ... శ్రీలంకతో పోరులో డకౌట్

  • గత మూడు మ్యాచ్ లలో రాణించిన కోహ్లీ
  • నేడు లంక యువ బౌలర్ బంతికి బౌల్డ్
  • ఒక్క పరుగూ చేయలేక ఉసూరుమనిపించిన కోహ్లీ
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. గత రెండు మ్యాచ్ ల్లో రాణించిన కోహ్లీ ఇక ఊపందుకున్నాడని అందరూ భావించేలోపే, ఇవాళ్టి మ్యాచ్ లో డకౌట్ అయి విమర్శకులకు మళ్లీ పనికల్పించాడు. శ్రీలంక యువ బౌలర్ దిల్షాన్ మధుశంక బౌలింగ్ లో కోహ్లీ బౌల్డయ్యాడు.

బంతి లైన్ ను అంచనా వేయడంలో పొరబడిన కోహ్లీ అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఎడమచేతి వాటి మధుశంక వేసిన ఇన్ స్వింగ్ డెలివరీ కోహ్లీ వికెట్లను తాకింది. కోహ్లీ గత మ్యాచ్ లలో అందిపుచ్చుకున్న ఆత్మవిశ్వాసం ఈ మ్యాచ్ తో అడుగంటింది. 

ఆసియా కప్ లో తొలుత పాకిస్థాన్ పై 35 పరుగులు చేసిన కోహ్లీ, ఆపై రెండో మ్యాచ్ లో హాంకాంగ్ పై 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. సూపర్-4 దశలో పాకిస్థాన్ తో జరిగిన పోరులో ధాటిగా ఆడి 60 పరుగులు సాధించాడు. అదే ఊపును శ్రీలంకపైనా కొనసాగిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఒక్క పరుగు కూడా చేయలేక ఉసూరుమంటూ పెవిలియన్ చేరాడు. 

కాగా, నేటి మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 13 ఓవర్లలో 3 వికెట్లకు 113 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 30, హార్దిక్ పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 41 బంతుల్లో 72 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.


More Telugu News