రావిరాల భూ నిర్వాసితుల కోసం 72 గంట‌ల దీక్ష‌కు దిగ‌నున్న ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

  • బండ‌రావిరాల‌, చిన్న రావిరాల‌లో భూమిని కోల్పోయిన రైతులు
  • ప‌రిహారం విష‌యంలో రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన కోమ‌టిరెడ్డి
  • ప‌రిహారం విష‌యంలో ద్వంద్వ ప్ర‌మాణాల‌పై కాంగ్రెస్ ఎంపీ ఆగ్ర‌హం
ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోసం భూమిని కోల్పోయిన రైతుల ప‌క్షాన దీక్ష‌కు దిగేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి నిర్ణ‌యించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిసి భూ నిర్వాసితుల ప‌క్షాన ఓ విన‌తి ప‌త్రాన్ని అంద‌జేసిన అనంత‌రం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండ‌లం బండ రావిరాల‌, చిన్న రావిరాల ప‌రిధిలో భూమిని కోల్పోయిన రైతుల‌కు ప‌రిహారం ఇవ్వాల‌న్న డిమాండ్‌తో 72 గంట‌ల దీక్ష‌కు దిగ‌నున్న‌ట్లు వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌టించారు. 

ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే ఓ ద‌ఫా న‌డిరోడ్డుపై బైఠాయించి వెంక‌ట్ రెడ్డి నిర‌స‌న తెలిపారు. అయినా స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో రైతుల ప‌క్షాన 72 గంట‌ల దీక్ష‌కు దిగేందుకు ఆయ‌న స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. భూమి కోల్పోయిన రైతుల‌కు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ర‌క‌మై‌న ప‌రిహారం ఇస్తున్న వైనంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విలువైన భూమిని కోల్పోయిన రైతుల‌కు అంత‌కు త‌గ్గ‌ట్లుగానే ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంద‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.


More Telugu News