హైదరాబాద్​ హౌస్ లో బంగ్లా ప్రధాని హసీనాతో మోదీ దైపాక్షిక చర్చలు

  • భారత్ లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న బంగ్లా ప్రధాని  
  • నేడు రాష్ట్రపతి భవన్ లో స్వాగతం పలికిన భారత ప్రధాని 
  • బంగ్లా విముక్తి పోరాటంలో భారత్ సహకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్న హసీనా
నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆమెకు త్రివిధ దళాల గౌరవ వందనం లభించింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో హసీనా, మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు మొదలయ్యాయి. వివిధ అంశాలపై చర్చించి ఇరుదేశాధినేతలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

ఈ భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన షేక్ హసీనా ఇరు దేశాల మధ్య స్నేహ బంధాన్ని గుర్తు చేశారు. ‘భారత్ మా మిత్ర దేశం. నేను భారతదేశానికి వచ్చినప్పుడల్లా, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రత్యేకించి మా విముక్తి యుద్ధంలో భారత్ చేసిన సహకారాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తుచేసుకుంటాము. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంది. ఒకరికొకరం సహకరించుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. 

మోదీతో జరిపే చర్చలు ఫలప్రదమవుతాయని ఆమె ఆశించారు. ‘ఆర్థికంగా అభివృద్ధి చెందడం, మా ప్రజల ప్రాథమిక అవసరాలను కూడా తీర్చడం మా ప్రధాన లక్ష్యం. వాటిని - మేము చేయగలము అనుకుంటున్నాం. స్నేహంతో, మీరు ఏ సమస్యనైనా పరిష్కరించగలరు. దానికి ఎల్లప్పుడూ మేం కట్టుబటి ఉంటాం’ బంగ్లా ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో ప్రజల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు షేక్ హసీనా తెలిపారు. 

‘ఈ సమస్యలపై ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయని నేను భావిస్తున్నాను, తద్వారా భారత్, బంగ్లాదేశ్‌లోనే కాకుండా దక్షిణ ఆసియా అంతటా ప్రజలు మెరుగైన జీవితాలను పొందగలుగుతారు. దానిపైనే మా ప్రధాన దృష్టి’ అని ఆమె చెప్పారు. కాగా, షేక్ హసీనా సోమవారం ఢిల్లీకి వచ్చారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం సాయంత్రం హసీనాను కలిశారు. ఈ పర్యటనలో షేక్ హసీనా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్ దీప్ లను కూడా కలుస్తారు.


More Telugu News