బ్రిటన్ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. దేశ హోం మంత్రి పదవికి ప్రీతి పటేల్ రాజీనామా

  • పీఎం ఎన్నికల్లో గెలుపొందిన లిజ్ ట్రస్
  • లిజ్ బాధ్యతలను స్వీకరించిన వెంటనే కొత్త హోం మంత్రి వస్తారన్న ప్రీతి పటేల్
  • చిన్న వయసులోనే కన్జర్వేటివ్ పార్టీలో సభ్యురాలు అయిన ప్రీతి
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. మరోవైపు బ్రిటన్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బ్రిటన్ హోం మంత్రి పదవికి ప్రీతి పటేల్ రాజీనామా చేశారు. దేశ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలను చేపట్టిన వెంటనే కొత్త హోం మంత్రి వస్తారని ఆమె అన్నారు. 

బ్రిటన్ లో అధికారంలో ఉన్న కన్వర్వేటివ్ పార్టీ మంత్రివర్గంలో ఉన్న భారత సంతతి మహిళ ప్రీతి పటేల్. చిన్న వయసులోనే ఆమె కన్జర్వేటివ్ పార్టీలో సభ్యురాలు అయింది. 2010లో ఆమె ఎంపీగా గెలుపొందారు. డేవిడ్ కామెరూన్ ప్రభుత్వంలో ఆమె స్థాయి పెరిగింది. 2014లో ఆర్ధిక మంత్రిగా పని చేశారు. 2015 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఉపాధి శాఖ సహాయ మంత్రిగా చేశారు. 

ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ కు ప్రీతి లేఖ రాశారు. ఇక నుంచి తాను తన విథామ్ నియోజకవర్గానికి సేవ చేస్తానని లేఖలో ఆమె తెలిపారు. లిజ్ ట్రస్ ప్రధాని సీటులో కూర్చున్న వెంటనే కొత్త హోం మంత్రి వస్తారని అన్నారు. దేశానికి సేవ చేసే అవకాశం తనకు లభించడం పట్ల చాలా గర్విస్తున్నానని చెప్పారు. పోలీసు వ్యవస్థకు మద్దతుగా నిలవడం, ఇమిగ్రేషన్ సిస్టంలో సంస్కరణలు తీసుకురావడం, దేశాన్ని సురక్షితంగా ఉంచడం పట్ల చాలా గర్వంగా ఉందని తెలిపారు.

మరోవైపు, ప్రధాని పదవి కోసం లిజ్ ట్రస్ తో పోటీ పడిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఓటమిపాలయ్యారు. అయితే, ప్రధాని లిజ్ ట్రస్ కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తానని చెప్పారు. ఇంకోవైపు ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ ఈరోజు తన రాజీనామా లేఖను బ్రిటన్ రాణి ఎలిజబెత్ కు అందజేయనున్నారు.


More Telugu News