64 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్న న్యాయమూర్తి

  • దాణా కుంభకోణం కేసులో లాలూకు శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్
  • బీజేపీ నేత, లాయర్ అయిన నూతన్ తివారీతో ప్రేమ
  • కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం
లేటు వయసులో రెండో పెళ్లి చేసుకున్న వార్తలు ఇటీవల తరచూ వినిపిస్తున్నా ఇది మాత్రం స్పెషల్. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ 64 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నారు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది.

 ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన జడ్జ్ శివపాల్ సింగ్ పదవీ విరమణకు ఆరు నెలల ముందు ఈ వివాహం చేసుకోవడం గమనార్హం. తన స్నేహితురాలు, బీజేపీ నాయకురాలు అయిన 50 ఏళ్ల న్యాయవాది నూతన్ తివారీని ఆయన మనువాడారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు శిక్ష విధించడంతో జడ్జ్ శివపాల్‌సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది.

వృత్తిరీత్యా లాయర్ అయిన నూతన్ భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోగా, న్యాయమూర్తి శివపాల్ భార్య రెండు దశాబ్దాల క్రితమే మరణించారు. శివ్‌పాల్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. నూతన్‌కు ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరు వివాహం చేసుకున్నారు. శివపాల్ సింగ్ ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో నూతన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సాన్నిహిత్యం మరింత పెరిగి ప్రేమకు దారితీసింది. చివరికి ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు.


More Telugu News