జింబాబ్వేలో 700 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన ‘తట్టు’.. యూనిసెఫ్ ఆందోళన

  • ఏప్రిల్‌లో మనికాల్యాండ్‌ ప్రావిన్సులో తొలి కేసు నమోదు
  • ఇప్పటి వరకు 6,291 కేసుల నమోదు
  • ఈ నెల 1న ఒక్క రోజే 37 మంది చిన్నారుల మృత్యువాత
  • మీజిల్స్ టీకా తీసుకోకపోవడం వల్లేనంటున్న నివేదికలు
ఆఫ్రికన్ కంట్రీ జింబాబ్వేలో ‘తట్టు’ (మీజిల్స్) బారినపడి దాదాపు 700 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌ తొలివారం మనికాల్యాండ్ ప్రావిన్సులో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత కొన్ని వారాల వ్యవధిలోనే దేశమంతా వ్యాపించింది. ఇప్పటి వరకు 6,291 కేసులు నమోదు కాగా 698 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెల 1న ఒక్కరోజే 37 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. రెండు వారాల క్రితం మరణాల సంఖ్య 157గా ఉండగా ఇప్పుడు ఏకంగా 700కు చేరడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోందని జింబాబ్వే ఆరోగ్య శాఖ తెలిపింది. 

ఈ మరణాలకు మీజిల్స్ టీకా తీసుకోకపోవడమే కారణమని పలు నివేదికలు చెబుతున్నాయి. మరణించిన చిన్నారుల్లో అత్యధికమంది టీకాలు తీసుకోనివారేనని మరో మంత్రి మోనైకా ముత్స్‌వాంగా తెలిపారు. మత విశ్వాసాల కారణంగా తమ పిల్లలకు టీకా వేయించేందుకు తల్లిదండ్రులు అంగీకరించరు. ఇప్పుడదే వారి ప్రాణాల మీదకు తెచ్చిందని చెబుతున్నారు. టీకాలను తిరస్కరించే వారికి అవగాహన తీసుకురావాలని, టీకాను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆరు నెలల నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరికి మీజిల్స్ టీకా ఇవ్వాల్సిందేనని మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జోహన్నస్ మారిసా పేర్కొన్నారు. మీజిల్స్ అనేది అంటువ్యాధి. దగ్గు, తుమ్ము, సన్నిహితంగా మెలగడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది సోకినవారికి దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులు దీని బారినపడే అవకాశాలు ఎక్కువ. జింబాబ్వేలో పెద్ద ఎత్తున నమోదవుతున్న మీజిల్స్ కేసులు, మరణాలపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.


More Telugu News