బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో ఓటమి అనంతరం స్పందించిన రిషి సునాక్

  • బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్
  • ట్రస్ కు మద్దతు ఇస్తానని సునాక్ ప్రకటన
  • కన్జర్వేటివ్ పార్టీ ఓ కుటుంబం వంటిదని వెల్లడి
బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో చివరి వరకు బరిలో నిలిచిన భారత సంతతి రాజకీయవేత్త, మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్ (42) ఓటమి అనంతరం స్పందించారు. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ వెన్నంటే మనమంతా నిలుద్దాం అంటూ కన్జర్వేటివ్ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. 

కన్జర్వేటివ్ పార్టీ ఓ కుటుంబం వంటిదని తాను మొదటి నుంచి చెబుతుంటానని వెల్లడించారు. ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న బ్రిటన్ పాలనా పగ్గాలు అందుకోబోతున్న లిజ్ ట్రస్ కు అందరం ఐక్యంగా మద్దతు పలుకుదామని తెలిపారు. రిషి సునాక్ గతంలో కూడా.... ఎన్నికల్లో తాను ఓడిపోతే తదుపరి ప్రభుత్వానికి తప్పకుండా సహకరిస్తానని ప్రకటించారు. 

లిజ్ ట్రస్ తో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో సునాక్ ఓటమిపాలయ్యారు. 47 ఏళ్ల లిజ్ ట్రస్ కు ఎన్నికల్లో 81,326 ఓట్లు లభించగా, సునాక్ కు 60,399 ఓట్లు వచ్చాయి. కన్జర్వేటివ్ పార్టీలో 1,72,437 మంది అర్హులైన ఓటర్లు ఉండగా, పోలింగ్ నాడు 82.6 శాతం ఓటింగ్ నమోదైంది. 654 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.


More Telugu News