టీటీడీ సిబ్బంది తనపై దాడికి యత్నించారన్న నటి అర్చనా గౌతమ్... ఖండించిన టీటీడీ

  • దర్శనం విషయంలో వివాదం
  • టీటీడీ సిబ్బందితో అర్చనా గౌతమ్ వాగ్వాదం
  • ఓ దశలో కన్నీటిపర్యంతమైన నటి
  • తమ సిబ్బందిపైనే చేయిచేసుకుందన్న టీటీడీ
  • తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆరోపణ
సినీ నటి, కాంగ్రెస్ నేత అర్చనా గౌతమ్ తిరుమలలో కలకలం సృష్టించారు. వీఐపీ దర్శనం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.10,500 వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. తాను డబ్బులు చెల్లించినా గానీ, రసీదు ఇచ్చి టోకెన్ ఇవ్వలేదని ఆరోపించారు. దర్శన టోకెన్ కోసం ప్రశ్నిస్తే టీటీడీ సిబ్బంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని అర్చనా గౌతమ్ తెలిపారు. స్వామివారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన తనతో టీటీడీ సిబ్బంది దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారని కన్నీటిపర్యంతమయ్యారు. 

అయితే, నటి ఆరోపణలను టీటీడీ ఖండించింది. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనానే దాడి చేసిందని ఆరోపించింది. అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేసిందని వివరించింది. రూ.10,500 టికెట్ తో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలని సూచిస్తే, దర్శనం కోసం రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించిందని వివరించింది. 

ఆగస్టు 31న అర్చనా గౌతమ్, శివకాంత్ తివారీ, మరో ఏడుగురు తిరుమల వచ్చారని టీటీడీ వెల్లడించింది. వారు కేంద్ర సహాయమంత్రి నుంచి సిఫారసు లేఖ తీసుకువచ్చారని తెలిపింది. వారు దర్శనం కోసం అడిషనల్ ఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, రూ.300 టికెట్లతో దర్శనం చేసుకునేలా శివకాంత్ తివారీ ఫోన్ కు సందేశం పంపినట్టు టీటీడీ వివరించింది. అయితే అర్చనా గౌతమ్ బృందం ఆ స్లాట్ ను వినియోగించుకోకపోవడంతో ఆ గడువు ముగిసిందని వెల్లడించింది. 

ఈ నేపథ్యంలోనే, అర్చనా గౌతమ్, శివకాంత్ తివారీ ఇష్టంవచ్చినట్టు మాట్లాడారని, ఓ ఉద్యోగిపైనా చేయిచేసుకున్నారని బోర్డు ఆరోపించింది. మరోసారి రూ.300 దర్శన టికెట్లు ఇచ్చేందుకు ప్రయత్నించినా వారు అంగీకరించలేదని తెలిపింది. అంతేకాకుండా, పోలీస్ స్టేషన్ లో టీటీడీ సిబ్బందిపై తప్పుడు ఆరోపణ చేసిందని పేర్కొంది.


More Telugu News