పైన సోలార్ ప్యానెళ్లు, కింద సైక్లింగ్ ట్రాక్‌... వ‌రల్డ్ క్లాస్ ట్రాక్‌కు రేపు కేటీఆర్ భూమి పూజ‌

  • నాన‌క్‌రామ్ గూడ స‌మీపంలో ఏర్పాటు కానున్న ట్రాక్‌
  • తొలి ద‌శ‌లో 23 కిలో మీట‌ర్ల మేర ఏర్పాటు చేస్తున్నామ‌న్న కేటీఆర్‌
  • ట్రాక్ డిజైన్‌పై ఫొటోలు, వీడియో విడుద‌ల చేసిన వైనం
భాగ్యన‌గ‌రి హైద‌రాబాద్ సిగ‌లో మ‌రో కీల‌క నిర్మాణం ఇమిడిపోనుంది. వ‌ర‌ల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్‌కు తెలంగాణ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ రేపు (సెప్టెంబ‌ర్ 6, మంగ‌ళ‌వారం) భూమి పూజ చేయ‌నున్నారు. హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డు మీద నానక్ రామ్ గూడ‌, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడెమీ, నార్సింగి, కొల్లూర్ ల స‌మీపంలో 23 కిలో మీట‌ర్ల మేర ప్ర‌పంచ శ్రేణి సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు కానుంది. ఈ ట్రాక్ వెంట పైన మొత్తంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు కానుండ‌గా... ఆ ప్యానెళ్ల నీడలో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు కానుంది. మూడు లేన్ల‌తో 4.5 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఈ ట్రాక్ ఏర్పాటు కానుంది. 

గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు ఈ ట్రాక్‌కు మంగ‌ళ‌వారం భూమి పూజ చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ట్రాక్ ఎలా ఉండ‌బోతోంద‌న్న దానిపై తెలంగాణ ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌తో పాటు కేటీఆర్ కూడా ప‌లు ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేశారు. ఈ 23 కిలో మీట‌ర్ల నిడివి క‌లిగిన ట్రాక్ తొలిద‌ని, భ‌విష్య‌త్తులో ఇలాంటి ట్రాక్‌ల‌ను న‌గ‌ర వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామ‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.


More Telugu News