అతని చేతులే ఇనుప రాడ్లు.. ఒక్క నిమిషంలో 68 బేస్​ బాల్​ బ్యాట్లను విరగ్గొట్టేశాడు.. వీడియో ఇదిగో

  • ‘హ్యామర్ హ్యాండ్ (సుత్తి చేయి)’గా పేరు పొందిన జర్మనీ మార్షల్ ఆర్టిస్ట్ మహమ్మద్ కహ్రిమనోవిక్
  • బేస్ బాల్ బ్యాట్లను విరగ్గొట్టి గిన్నిస్ బుక్ కు ఎక్కిన మార్షల్ ఆర్టిస్ట్
  • ఇంతకుముందు ఒకే నిమిషంలో 148 కొబ్బరికాయలు చేత్తో పగలగొట్టి రికార్డు
ఏదైనా ఓ మందపాటి కర్రను విరగ్గొట్టాలంటేనే కష్టం. చేతులు నొప్పెడుతాయి. ఇక క్రికెట్ బ్యాట్లు, బేస్ బాల్ బ్యాట్లు వంటి వాటిని విరగ్గొట్టాలంటే.. వామ్మో అనిపిస్తుంది కదా. నిజంగా చెప్పాలంటే ఏ పెద్ద కత్తితోనో, గొడ్డలితోనో, పెద్ద సుత్తితోనో అయితే తప్ప వాటిని విరగ్గొట్టలేం. కానీ జర్మనీకి చెందిన మహమ్మద్ కహ్రిమనోవిక్ అనే మార్షల్ ఆర్టిస్ట్ మాత్రం.. చాలా తేలిగ్గా చేతితో కొట్టి విరగ్గొట్టేస్తాడు. ఒకటి రెండు కాదు వరుసగా విరగ్గొడుతూనే ఉంటాడు. అందుకే ఆయనను ‘హ్యామర్ హ్యాండ్ (సుత్తి చేయి)’ అని పిలుస్తుంటారు. అంతేకాదు ఆయన వయసు ఎంతో తెలుసా 63 ఏళ్లు. తాజాగా కూడా ఆయన ఓ రికార్డు ఫీట్ సాధించాడు. 

కట్టె పుల్లలు విరిచేసినట్టుగా..
  • మహమ్మద్‌ కహ్రిమనోవిక్‌ ఇటీవల కేవలం ఒక్క నిమిషంలో 68 బేస్ బాల్ బ్యాట్లను విరగ్గొట్టి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు. ఇటీవల ఇటలీలోని మిలన్‌ లో జరిగిన ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో.. వరుసగా పేర్చి ఉన్న బేస్ బాల్ బ్యాట్లను కట్టె పుల్లలు విరిచేసినట్టుగా వరుసగా విరగ్గొడుతుంటే చూసి అంతా ఆశ్చర్యపోయారు.
  • మహమ్మద్‌ కహ్రిమనోవిక్‌ రికార్డు సృష్టించిన వీడియోను గిన్నిస్‌ బుక్ సంస్థ తమ యూట్యూబ్‌ చానల్ లో విడుదల చేసింది.
  • వీడియోను చూసిన కొందరు వామ్మో గట్టి పిండమేనని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ‘అసలు ఆ వీడియో చూస్తుంటేనే మా చేతులు నొప్పి పెడుతున్నాయి, ఆయనకు ఎలా ఉందో..’ అంటున్నారు. 
  • ఇంతకుముందు మహమ్మద్‌ కహ్రిమనోవిక్‌ కేవలం ఒకే నిమిషంలో చేతితో 148 కొబ్బరికాయలు పగులగొట్టి గిన్నిస్ రికార్డు సాధించాడు.


More Telugu News