వివాదాస్పద కోచ్ కు టీచర్చ్ డే శుభాకాంక్షలు తెలిపిన గంగూలీ

  • గతంలో టీమిండియా కోచ్ గా చాపెల్
  • ఆటగాళ్లతో చాపెల్ కు వివాదాలు
  • రచ్చకెక్కిన విభేదాలు
  • గంగూలీ, చాపెల్ మధ్య దూరం
  • కిర్ స్టెన్ రాకతో మారిన పరిస్థితి
  • అగ్రశ్రేణి జట్టుగా ఎదిగిన టీమిండియా
నేడు టీచర్స్ డే సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గురువులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా తాను గురువులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ఒకరు భారత క్రికెట్లో అత్యంత వివాదాస్పద కోచ్ గా పేరుపొందిన ఆసీస్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ కాగా, మరొకరు భారత క్రికెట్ ను అత్యున్నతస్థాయికి చేర్చడంతో పాటు, టీమిండియాను వరల్డ్ కప్ విజేతగా నిలిపిన గ్యారీ కిర్ స్టెన్. 

గంగూలీ తన 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ లో అనేక మంది కోచ్ లతో కలిసి పనిచేశాడు. న్యూజిలాండ్ కు చెందిన జాన్ రైట్ కోచ్ గా, గంగూలీ కెప్టెన్ గా టీమిండియా నవశకంలోకి ప్రవేశించింది. 

అయితే, 2003 వరల్డ్ కప్ తర్వాత కోచ్ గా వచ్చిన గ్రెగ్ చాపెల్ వైఖరి టీమిండియాలో అనేకమందికి నచ్చలేదు. గంగూలీ, చాపెల్ మధ్య కూడా విభేదాలు ఏర్పడ్డాయి. ఓ దశలో ఫామ్ కోల్పోయిన గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆపై వన్డే జట్టులోనూ స్థానం దక్కలేదు. 2006లో టెస్టు జట్టు నుంచి కూడా దాదాకు ఉద్వాసన పలికారు. అయితే అదే ఏడాది డిసెంబరులో దాదా టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. ఇక చాపెల్ ను బీసీసీఐ కూడా భరించలేకపోయింది. కొంతకాలానికే అతడిని వదిలించుకుంది. 

ఆ తర్వాత కాలంలో దక్షిణాఫ్రికా జాతీయుడైన కిర్ స్టెన్ టీమిండియా కోచ్ గా రావడం భారత క్రికెట్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం అని చెప్పాలి. టీమిండియా టెస్టుల్లో అగ్రశ్రేణి జట్టుగా ఎదగడమే కాకుండా, ర్యాంకుల్లోనూ మేటిగా నిలిచింది. అన్నింటికి మించి 2011లో భారత్ వన్డే ఫార్మాట్ లో వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో కిర్ స్టెన్ పాత్ర ఎనలేనిది. అందుకే, ఈ ఇద్దరికి తన కెరీర్ లో ప్రముఖ పాత్ర ఉందంటూ గంగూలీ టీచర్స్ డే సందర్భంగా ప్రస్తావించాడు.


More Telugu News