బెంగ‌ళూరు వ‌ర‌ద‌ల‌ వార్తలపై స్పందించిన మంత్రి కేటీఆర్‌

  • బెంగ‌ళూరును ముంచెత్తిన వ‌ర‌ద‌లు
  • సోషల్ మీడియా వేదిక‌గా సెటైర్లు పేలుతున్న వైనం
  • బెంగ‌ళూరు ప‌రిస్థితిపై వినూత్నంగా స్పందించిన కేటీఆర్‌
  • మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తేనే భార‌త న‌గ‌రాలు అభివృద్ధి సాధించ‌గ‌ల‌వ‌ని కామెంట్  
  • రాష్ట్రాల‌తో క‌లిసి కేంద్రం ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాల‌ని పిలుపు 
భార‌త సిలికాన్ వ్యాలీగా ప్ర‌సిద్ధికెక్కిన బెంగ‌ళూరు న‌గ‌రం ప్ర‌స్తుతం వ‌ర‌ద నీటిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఏకంగా బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలోకే నీళ్లు వ‌చ్చిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ వార్త‌ల‌పై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. దేశ ప్ర‌గ‌తికి ప‌ట్టుకొమ్మ‌లైన ప‌ట్ట‌ణాలను మ‌రింత‌గా అభివృద్ధి చేసుకోవాల్సిన అవ‌స‌రాన్ని చెబుతూ ఆయ‌న చేసిన వ‌రుస ట్వీట్లు వైర‌ల్‌గా మారాయి. 

బెంగ‌ళూరు ప‌రిస్థితిపై వ్యాఖ్య‌లు చేస్తున్న వారంద‌రికీ ఇదే నా మ‌న‌వి అంటూ మొద‌లుపెట్టిన కేటీఆర్‌... మ‌న న‌గ‌రాలే మ‌న దేశ, రాష్ట్రాల‌ అభివృద్ధికి ప్రాథమిక వ‌న‌రుల‌ని పేర్కొన్నారు. వేగవంతమైన పట్టణీకరణ నేపథ్యంలో తగినంత మూలధనాన్ని కల్పించలేకపోతే మౌలిక సదుపాయాలు దిగ‌జారిపోతాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌ స‌హా దేశంలోని ఏ ఒక్క న‌గ‌రానికి కూడా అప్ప‌టికప్పుడు త‌లెత్తే పెను వాతావ‌ర‌ణ మార్పుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగే శ‌క్తి లేద‌ని తెలిపారు. 

దేశం పురోగ‌తిలోనే ప్ర‌యాణించాల‌నుకుంటే... మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఉమ్మ‌డిగా ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. న‌గ‌ర పాల‌న‌లో వినూత్న ప‌రిణామాలు అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యంలో పాత చింత‌కాయ ప‌చ్చ‌డి ప‌ద్ద‌తుల‌కు స్వ‌స్తి చెప్పి ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాల్సి ఉంద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప‌రిశుభ్ర‌మైన రోడ్లు, నీళ్లు, గాలితో పాటు వ‌ర‌ద నీటి నియంత్ర‌ణ‌లో మెరుగైన చ‌ర్య‌ల రూప‌క‌ల్ప‌న పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 

ఇందుకోసం మ‌న‌కు మ‌రింత మేర నిధులు కావాల్సి ఉంద‌ని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ దిశ‌గా కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి దృష్టి సారించాల‌ని కోరారు. ఈ విష‌యాల‌ను తాను ప్ర‌స్తావించ‌డం చాలా మంది హైద‌రాబాదీల‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చ‌ని పేర్కొన్న కేటీఆర్‌... అందుకు గ‌తంలో హైద‌రాబాద్‌ను ఇలాగే బెంగ‌ళూరు వాసులు హేళ‌న చేయ‌డ‌మేన‌ని గుర్తు చేశారు. అయితే దేశీయంగా అభివృద్ధి సాధించాలంటే స‌మైక్యంగా సాగే దిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.


More Telugu News