ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన సంపూర్ణంగా మద్దతిస్తుంది: పవన్ కల్యాణ్

  • నేడు ఉపాధ్యాయ దినోత్సవం
  • గురువులకు ప్రణామాలు అర్పించిన పవన్ కల్యాణ్
  • ఏపీలో టీచర్లు నలిగిపోతున్నారని వ్యాఖ్య  
  • గురువులను వేధిస్తే చరిత్ర హీనులవుతారని స్పష్టీకరణ
  • ప్రభుత్వానికి ఉపాధ్యాయులే కళ్లు తెరిపించాలని పిలుపు
ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఉపాధ్యాయ దినోత్సవం శుభవేళ విజ్ఞాన ప్రదాతలైన గురువులకు వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నానని తెలిపారు. ఒక దేశం లేదా ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని సమాజంతో పాటు తాను కూడా విశ్వసిస్తానని వెల్లడించారు. 

అయితే, ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం ఏపీలో కళావిహీనంగా కనిపించే పరిస్థితులు నెలకొనడం బాధ కలిగిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ, హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఈ వేడుకలు బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం వారు ఎంతగా నలిగిపోతున్నారో తెలుపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయని వివరించారు. 

వేధింపులతో పాలిస్తున్న ఈ కబోది ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కళ్లు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నానని తెలిపారు. ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


More Telugu News